రష్యా దాడితో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తన వద్ద ఉన్న తక్కువ ఆయుధాలతోనే పోరాటం చేస్తోంది. స్వయంగా దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం యుద్ధ భూమిలోకి దిగారు. అలాగే దేశ ప్రజలకు కూడా ఆయుధాలు ఇస్తామని పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా ముందుకు వచ్చిన యువతే..అనస్తేషియా లెన్నా. ఆమె మాజీ మిస్ ఉక్రెయిన్. ప్రస్తుతం ఆమె గన్ పట్టి శత్రువులను మట్టుబెట్టేందుకు యుద్ధ భేరిలో పాల్గొంటున్నారు.

తమ దేశ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది. ఆ దేశ బలగాలపై ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడికి దిగింది. రష్యన్ ఆర్మీకి చెందిన ఐఎల్-76 ఎయిర్ క్రాఫ్ట్ ను కూల్చేసింది. అలాగే 150మంది రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.

మరోవైపు ఉక్రెయిన్ సైనికుడు ఒకరు తనను తాను పేల్చేసుకున్న ఘటన కంటతడి పెట్టిస్తోంది. క్రిమియా నుంచి చొచ్చుకు వస్తున్న రష్యా దళాలను నిలువరించడం కోసం బ్రిడ్జిని పేల్చేయాలని మెరైన్ బెటాలియన్ ఇంజినీర్ వొలొదిమిరోవిచ్ సంకల్పించాడు. అందుకు బ్రిడ్జికి బాంబులు అమర్చాలనుకున్నాడు. ఈ లోపే రష్యా బలగాలు దూసుకురావడంతో ఆ బాంబులను తనకే అమర్చుకొని బ్రిడ్జిని పేల్చేశాడు.

ఇక ఉక్రెయిన్ లో రష్యా సైనికులు దురాగతాలకు పాల్పడుతున్నారు. సామాన్య జనంపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కీవ్ పార్లమెంట్ భవనానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వెళ్తున్న కారుపై రష్యా సైనికులు యుద్ధ ట్యాంకును ఎక్కించారు. అక్కడితో ఆగకుండా మరోసారి వెనక్కి వెళ్లి మరీ ఆ కారును తొక్కించారు. నుజ్జునుజ్జయిన కారులో చిక్కుకున్న డ్రైవర్ ను స్థానికులు బయటకు తీశారు. అతను స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నాడు.  


మరోవైపు ప్రపంచం రెండో వలస సంక్షోభాన్ని చూస్తోంది. 2021, ఆగస్టులో ఆఫ్ఘానిస్థాన్ లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో.. లక్షల మంది ప్రజలు పలు దేశాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో దాదాపు 50లక్షల మంది ఉక్రెయిన్లు పొరుగున ఉన్న ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది.








 

మరింత సమాచారం తెలుసుకోండి: