కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఆందోళనలకు తావిస్తోంది. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన ఉస్మానియా యూనిరవర్శిటీని సందర్శించే కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. అయితే రాజకీయ సభలకు ఓయూలో అనుమతి లేదంటూ వీసీ కాంగ్రెస్ నాయకుల ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్‌ అనుబంధ విభాగాల నాయకులు వీసీ తీరుకి నిరసనగా ఆందోళనకు దిగాయి. ఓయూలో ఉన్న కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి నేతలు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడించడానికి ప్రయత్నించారు. వీసీ చాంబర్ ముందు చీరలు, గాజులతో ప్రదర్శన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గొడవ మరింత ముదిరింది. విద్యార్థి నాయకులను పరామర్శించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకీ తీసుకోవడం మరో విశేషం. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతికోసం మరోసారి వీసీ ని కలవబోతున్నారు కాంగ్రెస్ నేతలు.

రాహుల్‌ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతినివ్వకపోవడాన్ని పార్టీలకతీతంగా కొన్ని సంఘాలు తప్పుపడుతున్నాయి. రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం సరికాదని అన్నారు ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మానవతా రాయ్. చెనగాని దయాకర్, లోకేష్ యాదవ్.. సహా మరికొందరు విద్యార్థి నాయకులు బంజారాహిల్స్‌ లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ ను ముట్టడించారు.

ఓయూలో రాహుల్‌ గాంధీ సమావేశానికి అనుమతివ్వకపోవడం నియంతృత్వమని అన్నారు కాంగ్రెస్ నేతలు. మనం నియంత రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టుపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని అందుకే ఓయూని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు. యూనివర్శిటీ అధికారులు టీఆర్‌ఎస్‌ కు గులాముల్లా పనిచేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట రాజకీయ సభలు జరిగినా పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ ఓయూకి వస్తారని చెబుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: