హైదరాబాద్: అగ్గిపెట్టెలో చీరను పొందపర్చిన చరిత్ర సిరిసిల్ల చేనేతన్నది. ఒకనాడు సిరిసింపదలతో కళకళలాడిన సిరిసిల్ల నేడు ఉరిశాలగా మారింది. శ్మశాన వాతావరణం సంచరిస్తుంది. నూలుపోగే ఉరితాళ్లవుతున్నయి. నేతన్న దుర్భర పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాడు. చేయూతనిచ్చే వారు లేక దిక్కుతోచక ఆత్మహత్యనే శరణ్యమనుకుంటున్నాడు. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలతో సిరిసిల్ల రోదిస్తోంది. తల్లడిల్లుతోంది. రక రకాలైన డిజైన్ల చీరలను నేయడంలో సిరిసిల్ల చేనేత కార్మికుడిది అందెవేసిన చెయ్యి.  చీరల తయారీలో దేశంలోనే సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు చీరలను ఎగుమతి చేస్తారు. ఇక్కడ ఎన్నో వందల కుటుంబాలు చేనేత పరిశ్రమపై జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు సిరిసిల్ల కార్మికులకు చేతినిండ పని వుండేది. కడుపు నిండ బువ్వ దొరికేది. కానీ, కాలం మారిన కొద్దీ వచ్చిన ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని మగ్గాలు మూలనపడ్డాయి. వీటిపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు వీధినపడ్డారు. ఇదే వ్రుత్తిని నమ్ముకున్న వారికి పని లేకుండా పోయింది.  అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చేసేదేమీ లేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చీరలో తయారీలో దేశంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల ఆత్మహత్యల విషయంలోనూ అంతే రికార్డును సాధించుకుంది. ఆత్మహత్య చేసుకోని చేనేత కుటుంబం సిరిసిల్లలో లేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. చేనేత కార్మికుల ఆత్మహత్యలతో సిరిసిల్ల కాస్త ఉరిసిల్లగా మారింది. చేనేత పరిశ్రమను కాపాడేందుకు గానూ రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ, ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. సిరిసిల్ల నేతన్న మొర అరణ్య రోదనగా మిగిలింది.  ఆకలి చావులు, ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే వున్నాయి. పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపండంటూ చేస్తున్న విన్నపాలు పాలకులకు ‘చెవిటోడి ముందు శంఖు ఊదిన’చందంగానే తయారైంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన సిరిసిల్ల నేతన్న బతుకు మాత్రం‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’అన్న చందంగా మారింది. సిరిసిల్ల చేనేతన్న కాపాడుకోవడం కోసం అనేక ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నాయి. కానీ, ఫలితం ఏమీ లేదు. తాజాగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పోరుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్ల కార్మికుల దుర్భర పరిస్థితులపై ఈ నెల 23న సిరిసిల్లలోనే ఒకరోజు దీక్షకు దిగనున్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో విజయమ్మ ఈ దీక్షకు దిగుతున్నట్లు వైఎస్ఆర్ సీపీ నాయకులు వెల్లడించారు.  చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోవడంతో చివరగా వైఎస్ఆర్ పోరుకు సై అన్నది. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపేందుకు విజయమ్మ సిరిసిల్ల వేదికగా దీక్షకు దిగుతున్నట్లు ఆ పార్టీ నాయకులు వివరించారు. చేనేత కార్మికుల సమస్యపై పోరాడేందుకు తెలంగాణ గడ్డకు వస్తున్నది విజయమ్మ. ఆమె దీక్ష కోసం వైఎస్ఆర్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేనేత కార్మికుల విషయంలో మానవతాద్రుక్పథంతో ఆలోచన చేయాల్సిందిగా మనమూ కోరుకుందాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: