హైదరాబాద్: రాష్ర్ట కేబినెట్ లో మునుపెన్నడూ లేని విధంగా రాష్ర్ట మంత్రి వర్యులు అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ఓటరన్న తలదించుకునే విధంగా చేస్తున్నారు. కొందరు ఊచలు లెఖ్కపెడుతున్నారు. మరికొందరు క్యూలో ఉన్నారు. మంత్రి వర్గంలోని మంత్రులు ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం కిరణ్ సర్కార్కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కల్గించే విధంగా తయారైంది. కేసుల్లో చిక్కుకున్న వారందరూ సీనియర్లే. అన్నీ తెలిసిన వారే. అయినా, అవినీతి, ఆరోపణలలో చిక్కుకుని కొట్టుకుంటున్నారు. కటకటాలపాలవుతున్నారు.  రాష్ర్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏవయితే ప్రమాణాలు చేశారో వాటన్నింటిని పలువురు మంత్రులు తుంగలో తొక్కారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, రాగ,ధ్వేషాలు, బంధుప్రీతి జోలికి వెళ్లకుండా, అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా, నీతి, నిజాయితీతో పనిచేస్తామంటూ అనేక విధాలుగా ప్రమాణాలు చేసిన మంత్రివర్యులు వాటన్నింటిని ‘గాలి’కి వదిలి వేశారు. ఫలాన వారు తాము ఓటేసి గెలిపించిన వ్యక్తి అని, మంత్రి అయ్యారనీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా సిగ్గుమాలిన చర్యలకు పాల్పడ్డ ఘన చరిత్రను మన మంత్రివర్యులు మూటగట్టుకున్నారు. సీఎం కిరణ్ కేబినెట్ లో 40మంది మంత్రులున్నారు.  వీరిలో మొత్తం 11మంది మంత్రులకు అవినీతి మచ్చ అంటుకుంది. అంటుకోవడమే కాదు, ఇప్పటికే ఓ మంత్రి చంచల్ గూడ జైలులో ఊచలు లెఖ్కపెడుతున్నారు. 10సంవత్సరాల కిందటి కేసు విషయంలో నాంపల్లిలోని ఆర్థిక నేరాల కోర్టు జరిమానతో పాటు జైలు శిక్షను వేసింది. ఇంకో మంత్రి గాలి బెయిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లాలో జరిగిన దళితుల ఊచకోతలో బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళి, మద్యం ముడుపుల కేసులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఐదుగురు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. కేబినెట్ లోని ఒక్కో మంత్రి ఒక్కో కేసులో ఇరుక్కుంటున్నారు. ఇంత మొత్తంలో రాష్ర్ట కేబినెట్ లో మంత్రులు కోర్టు మెట్లు ఎక్కింది, జైలులో ఊచలు లెఖ్కపెట్టిన సందర్భాలు రాష్ర్ట చరిత్రలోనే లేవు. కానీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ కు చెందిన 40మందిలో 11మంది మంత్రులు అవినీతి, ఆరోపణలతో సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో మరి కొందరు కూడా ఈ అవినీతి రొంపిలోకి రావడం తథ్యంగా కనిపిస్తోంది.  ఇక ఎమ్మెల్యలు, ఎంపీల గురించి వేరే చెప్పనక్కర్లేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జారీ చేసిన జీవోలకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ చంచల్ గూడ జైలులో ఉన్నారు. గీతారెడ్డి, సబితా రెడ్డి, ధర్మాన ప్రసాద్, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మానారాయణ తదితరులు సుప్రీం కోర్టులో విచారణ ఎదుర్కొటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదన్న కారణంతో కె.పార్థసారథికి నిన్ననే కోర్టు 2నెలల శిక్షను విధించింది. మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి గాయిల్ జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసును డీల్ చేశాడనీ ఇదే కేసులో సస్పెండయిన లక్ష్మీనరసింహరావే ఏకంగా ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కో మంత్రి ఒక్కో కేసులో ఇరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మొత్తానికి కిరణ్ కుమార్ కేబినెట్ అంతా కళంకితులతో నిండిపోయిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: