హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష మొదలుపెట్టారు. ఈ మారు విద్యార్థుల కోసం దీక్షను చేస్తున్నారు. దీక్షా స్థలికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు. అటు విద్యార్థులు, ఇటు కార్యకర్తలతో దీక్షా వేదిక కిక్కిరిసిపోయింది. దీక్షకు ముందుగా ఏలూరులోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. దీక్ష వద్ద భారీ ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షం పడ్డా కూడా తడవకుండా ఉండేందుకు నిర్వహాకులు అన్ని ఏర్పాట్లను చేశారు.  పేద విద్యార్థులు చదవుకునే నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురియంబర్స్ మెంటు పథకంపై రాష్ర్ట పెద్దలు తలా ఓ మాట మాట్లాడుతున్నారు.దీనితో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయానికి గురౌతున్నారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న పీజు రీయింబర్స్ మెంటు పథకం ఉంచాలా? వద్దా? అనేదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. రాష్ర్ట కేబినెట్ను కాదనీ, గవర్నర్ మాత్రం ఈ స్కీం అందరికీ వర్తిస్తుందంటున్నారు. ఫీజు రీయింబర్స్ మెంటుపై రాష్ర్ట పెద్దలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతుండటంతో ఈ పథకం వల్ల చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఊగిసలాటగా మారింది. డబ్బుల భారంతో రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేస్తే రాష్ర్ట వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల చదువులు అర్ధాంతరంగానే ఆగిపోవడం ఖాయం. ఫీజురియంబర్స్ మెంటుపై ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా ఉండేందుకు, ఈపథకాన్ని యధాతథంగా కొనసాగించాలనీ డిమాండు చేస్తూ వైఎస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కేంద్రంగా నేటి నుంచి రెండు రోజుల పాటు దీక్షకు చేస్తున్నారు. సుమారు 25లక్షల మంది పేద విద్యార్థుల తరుపున ఆమె ఈ దీక్షకు దిగారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతమైన విద్యనభ్యసించడమే కాకుండా, దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది. అలాంటి పథకాన్ని డబ్బుల సాకు చూపి ఆపాలనీ చూడటం సరైంది కాదనీ అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్త్వానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో తన రెండు రోజుల దీక్ష ద్వారనైనా ప్రభుత్వం మెడలు వంచేందుకు విజయమ్మ ఏలూరులో దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో పాల్గొనేందుకు వేలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. పుట్టెడు దు:ఖాన్ని గుండెల్లో దిగమింగుకుంటూ మొన్న కడపలో రైతు సమస్యలపై, విజయవాడలో కరంటు కోతలపై, నిన్న సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలపై దీక్షలు చేపట్టిన విజయమ్మ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటును యథాతథంగా అమలు చేయాలంటూ నేడు ఏలూరులో పోరుకు సై అంటోంది. ఓ వైపు భర్తను పోగొట్టుకుని, మరోవైపు కొడుకు జైలుకు వెళ్లడంతో గుండెలనిండ బాధల్ని గుండెల్లోనే దాచుకుని విజయమ్మ అనునిత్యం ప్రజల్లోనే ఉంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: