టీడీపీలో ప్రస్తుతం ఇద్దరు నాయకుల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఆందోళన అందరిలోనూ పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెండు వర్గాల మధ్య పోరు పతాక స్తాయికి చేరుతున్నా.. అధిష్ఠానం మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా.. ఎవరూ తమ పట్టు వీడటం లేదు. వీరి మధ్య విభేదాలు ఎలా ఉన్నా.. రెండు నియోజకవర్గాలపై వీరి రచ్చ ప్రభావం పడుతోంది. ఒకరిని ఒకరు దెబ్బతీసుకునేందుకు వేస్తున్న వ్యూహాల ఫలితంగా పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని నాయకులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఇప్పుడు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు స్థానిక నాయకులకే గాక టీడీపీ పెద్దలను కూడా కలవరపెడుతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా అఖిల ప్రియ మధ్య వైరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.

భూమా నాగిరెడ్డి హయాంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి. భూమా సొంత మనిషిగా పేరు సంపాదించిన ఏవీ.. ఆ కుటుంబంపైనే తిరుగుబాటు చేస్తున్నారు. భూమా వ్యాపారాలను దగ్గరుండి చూసుకున్నాడు. ఉన్నట్టుండి నాగిరెడ్డి చనిపోవడంతో వ్యాపార సామ్రాజ్యంలో చాలా భాగం ఏవీ చేతుల్లోనే నిలిచిపోయింది. దీంతో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య రచ్చ తారస్థాయికి చేరింది. ఇప్పటికే వీళ్లు బహిరంగంగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మొదలైన పొలిటికల్ గేమ్ ఇప్పుడు చివరకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరు చీడ పురుగు అని అంటే మరొకరు అంత కన్నా హీనం అని దూషించుకున్నారు.

తమను ఏవీ మోసం చేశాడనే భావనతో ఉన్నారు భూమా నాగిరెడ్డి పిల్లలు. అందుకే వీరు ఏవీపై విరుచుకుపడు తున్నారు. వీరికి ఏవీ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ కోసం ఏవీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విధంగా అఖిలప్రియ సీటుకే ఈయన ఎర్త్ పెడుతున్నారు. వీళ్లలో ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారు? అనేది తర్వాతి సంగతి కానీ, వీళ్ల గొడవతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ దెబ్బ తింటోందనే మాట వినిపిస్తోంది. అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఏవీ, అఖిలప్రియల రచ్చ ప్రభావం ఉంటుందని.. ఒకర్నొకరు దెబ్బతీసుకోవడంలో వీళ్లు పార్టీని కూడా బాగానే దెబ్బతీస్తున్నారని సమాచారం.

భూమా మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి ఉన్నా.. విజయం కోసం టీడీపీ ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఇలా అంతా అక్కడే మకాం వేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. ఇలాంటి సమయంలో ఏవీ, భూమా అఖిలప్రియ మధ్య విభేదాలు మరింత ముదరకముందే.. పార్టీ పరిస్థితి ఘోరంగా మారకముందే.. అధిష్ఠానం చెక్ చెప్పాలని ద్వితీయశ్రేణి నాయకులు కోరుతున్నారు. లేనిపక్షంలో రెండు సీట్లపై ఆశలు గల్లంతు అవుతాయని హెచ్చరిస్తున్నారు.