తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం లో సాగునీటి ప్రాజెక్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తోన్న వైకాపా సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి అంచనాలకు మించి జరిగిందని  ఆరోపిస్తోన్న జగన్ సర్కార్ , ప్రాజెక్టు పనులను నిలిపివేసి , కాంట్రాక్టును రద్దు చేసింది .  రివర్స్ టెండరింగ్ వల్ల అదనపు భారం పడుతుందని , సాగునీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు , చైర్మన్ ఆందోళన వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరన్నది ఇప్పటికే విస్పష్టమయింది.


 తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం ద్వారా జగన్ మనోగతం మరోమారు స్పష్టమయింది .  ప్రభుత్వం  ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ , కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానంపై  జూలై 22 తేదీన నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు  విడుదల చేసింది . మొత్తం 29 అంశాలను రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలుగా నిర్దేశించిన ప్రభుత్వం ...   ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్ కార్యాచరణ  చేపట్టాలని నిర్ణయించింది .   నిర్మిత ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టు సంస్థను తప్పించిన అనంతరం మిగిలిన పనులను అసలు ఒప్పంద రేట్లతో  ప్రాథమిక అంచనా విలువగా  జలవనరుల శాఖ   నిర్ధారించనుంది.


 ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజక్టు మిగిలిన పనులకు ప్రభుత్వం  ఈ టెండరింగ్ కు  వెళ్లాలని నిర్ణయించింది .   ఈ టెండరింగ్ లో పాల్గోనే కాంట్రాక్టు సంస్థ ఏపీలో రిజిస్టర్ కావాలన్న నిబంధన సడలింపు చేసింది . దీనితో దేశవ్యాప్తంగా ఎక్కడ  కంపెనీలు రిజిస్టర్ అయిన ఈ టెండరింగ్ లో పాల్గొనే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది .   బిడ్డరు రాకపోతే మిగిలిన పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి  ఈ - టెండరింగ్ ద్వారా కేటాయించనున్నట్లు ప్రకటించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: