హెచ్చార్ ఏ.. అంటే.. హౌస్ రెంట్ అల‌వెన్స్‌. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతంలో క‌లిపి స‌ర్కారు నెల నెలా చెల్లిస్తుంది. అంటే.. ఉద్యోగులు నివ‌సించే ఇంటికి ప్ర‌భుత్వ‌మే అద్దె క‌డుతుంది. ఒక‌వేళ ప్ర‌భుత్వం కేటాయించిన క్వార్ట‌ర్స్‌లోనే నివాసం ఉంటే.. మాత్రం హెచ్చార్ ఏ ఉండ‌దు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు దీని గురించి పెద్ద‌గా తెలియక పోవ‌చ్చు. అయితే, తాజాగా ఈ విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వెలుగులోకి తెచ్చిన ఉదంత‌మే. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మాజీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు క‌లిసి ఉన్న ఇంటికి ప్ర‌భుత్వం అక్ష‌రాలా కోటీ 20 ల‌క్ష‌ల మేర‌కు హెచ్చార్ ఏ చెల్లించింది.


దీనికి సంబంధించిన ప‌త్రాలు, ఆధారాలను కూడా ఆళ్ల మీడియా ముందుకు తెచ్చారు. విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం విప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నివ‌సిస్తున్న కృష్ణాతీరంలోని లింగ‌మ‌నేని ఎస్టేట్ అక్ర‌మ నిర్మాణ‌మ‌ని, దీనిని కూల్చివేస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు నోటీసులు జారీ చేసింది అయితే, ఇది స‌క్ర‌మ‌మ నిర్మాణ‌మేన‌ని, అప్ప‌టి పంచాయ‌తీ నుంచి అన్ని అనుమ‌తులు తీసుకున్నాకే దీనిని నిర్మించామ‌ని లింగ‌మ‌నేని ర‌మేష్ స్ప‌ష్టం చేశారు. ఇదిలావుంటే, అప్ప‌ట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు 2015లో ఈ నివాసంపై వివాదం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. ఇది ప్ర‌భుత్వానిదేన‌ని, లింగ‌మ‌నేని ర‌మేష్ అనే ఆయ‌న ల్యాండ్ పూలింగ్‌లో ప్ర‌భుత్వానికి దీనిని సరెండ‌ర్ చేశార‌ని, అయితే, ఒక వేళ ఆయ‌న ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వ‌క‌పోయి ఉంటే.. రాజ‌ధాని సేక‌ర‌ణలో భాగంగా అయినా సొంతం చేసుకునేవార‌మ‌ని చెప్పుకొచ్చారు.


అంటే.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. లింగ‌మ‌నేని నుంచి ఈ భ‌వ‌నాన్ని (జీ+2) ప్ర‌భుత్వమే తీసుకుని, దీనిలో చంద్ర‌బాబు మ‌కాం ఏర్పాటు చేసుకున్నారు. అంటే.. ఇది ప్ర‌భుత్వ భ‌వ‌న‌మే! క‌ట్ చేస్తే.. ఈ భ‌వ‌నానికి కోటీ 20 ల‌క్ష‌ల మేర‌కు హెచ్ ఆర్ ఏను గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెల్లించింది. అంటే.. ప్ర‌భుత్వ భ‌వనంలో ఉంటూనే.. ఈ భ‌వ‌నానికి గ‌త సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల సొమ్మును అద్దె రూపంలో చెల్లించార‌న్న మాట‌. ఇదీ ఇప్పుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేసిన ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఎక్క‌డైనా కూడా ప్ర‌భుత్వంలో ఉన్న వారు తాము నివ‌సిస్తున్న భ‌వ‌నాల‌కు తామే అద్దె చెల్లించుకున్న సంస్కృతి ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.


దీనిపైనే ఆళ్ల ప్ర‌శ్న‌లు సంధించారు. నారా లోకేష్‌, నారా చంద్ర‌బాబులు నివాసం ఉన్న భ‌వ‌నానికి సంబంధించి రూ.కోటీ 20 ల‌క్ష‌ల మేర‌కు హెచ్ ఆర్ ఏ ఎవ‌రికి చెల్లించారు? ఒక‌వేళ‌.. లింగ‌మ‌నేని ర‌మేష్‌కే చెల్లించి ఉంటే.. ఆయ‌న ఆయా వివ‌రాల‌ను ట్యాక్స్ రిట‌ర్న్‌లో చూపించారా?  అలా అయితే, ప్ర‌భుత్వం దీనిని త‌న భ‌వ‌నం కాద‌ని ఒప్పుకున్న‌ట్టేన‌ని, మ‌రి ప్రైవేటు భ‌వ‌నం అయిన‌ప్పుడు చంద్ర‌బాబు ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక వేళ ప్ర‌భుత్వ భ‌వ‌న‌మే అయితే.. అక్ర‌మాల‌తో నిర్మించిన‌దానిని అడ్డుకుంటే ఎందుకు ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆళ్ల ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో హెచ్ ఆర్ ఏగా ప్ర‌జ‌ల సొమ్ము రూ.కోటీ 20 ల‌క్ష‌ల‌ను ఎవ‌రు ఎవ‌రికి చెల్లించారు?  ఎవ‌రి జేబుల్లోకి వెళ్లింద‌నేది తేలాల్సి ఉంద‌ని అంటున్నారు ఆళ్ల‌. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు స్పందిస్తారా?  లింగ‌మ‌నేని జ‌వాబు చెబుతాడా?  చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: