అవును.. ఏపీకి మళ్లీ పండుగ వచ్చింది. అది కూడా ఐదేళ్ల తర్వాత వచ్చింది. నవంబర్ ఒకటి మళ్లీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగనుంది. దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికీ ఓ అవతరణ దినోత్సవం ఉంటుంది కానీ.. తెలుగుదేశం పాలన పుణ్యమా అని గత ఐదేళ్లూ ఏపీ అవతరణ దినోత్సవం జరగలేదు.


పొరుగున ఉన్న తెలంగాణా జూన్ 2న  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూంటే ఏపీలో గత పాలకులు విస్మరించారు.   పొట్టి శ్రీరాములు పొరాడి సాధించిన ఆంధ్రరాష్ట్రానికి ఒక పుట్టిన రోజు అంటూ ఉందని ఇపుడు జగన్‌ సర్కార్ అంటోంది. నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఓ పండుగలా వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించింది.


నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల్లో నిర్వహించే  వేడుకలకు ముఖ్యఅతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు హాజరవుతున్నారు.  


రాష్ట్రావతరణ వేడుకల కార్యక్రమాలు నవంబరు 1వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభ మవుతాయి. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తారు. హస్తకళలు, చేతి ఉత్పత్తుల ప్రదర్శన, జిల్లాకు ప్రత్యేకమైన వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లా ప్రగతిపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.


ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రులపాత్ర తదితర అంశాలపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు రాష్ట్ర చరిత్ర, స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రుల పాత్ర తదితర అంశాలపై వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: