హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన మహారాష్ట్రలో కొత్త పొత్తుపొడిచింది. శివసేనతో కాంగ్రెస్‌, ఎన్సీపీ జతకట్టాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఈ మూడు పార్టీల కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతకీ అధికారాన్ని మూడు పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయి. సీఎం పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది..?  

 

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీల సమావేశంలో ఏకాభిప్రాయం కుందిరింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా మూడు పార్టీల నేతలు ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు కీలక నేతల భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు శివసేన నేత సంజయ్‌ రౌత్‌. త్వరలో ఈ శుభవార్తను ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతారని... స్వీట్లకు కూడా ఆర్డరిచ్చేశామని చెప్పుకొచ్చారు. డిసెంబర్‌ 1 లోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. 

 

మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై సీడబ్ల్యూసీ సమావేశమైంది. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించామన్నారు కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌. ఎన్సీపీతో చర్చలు కొనసాగుతున్నాయనీ... ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. కాంగ్రెస్‌-ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సీఎం పదవి ఎవరికి దక్కబోతోందనే అంశంపై హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదిత్య థాక్రేకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని మొదటి నుంచి బీజేపీని పట్టుబట్టింది శివసేన. చివరికి బీజేపీతో దశాబ్దాల అనుబంధానికి చెల్లుచీటీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌-ఎన్సీపీతో పొత్తు కుదిరితే... శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవిని చేపడతారనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యవహారంపై త్వరలోనే స్పష్టత రానుంది. 

 

మరోవైపు శివసేనలో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ అభిమాన నేత సీఎం అవుతారనే వార్తలు గుప్పుమనుతుండటంతో సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తారనే ధీమాతో ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే అసలు విషయం తెలుస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: