మొత్తానికి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల విషయంలో  దారిలోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. మొన్నటి వరకూ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయాన్ని కన్నా పూర్తిగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలో  రాజధాని ఏర్పాటవచ్చన్న జగన్ ప్రతిపాదనను కన్నా ప్రతిరోజు వ్యతిరేకిస్తునే ఉన్నారు. జగన్ ప్రకటన రాగానే స్వాగతించిన కన్నా మరుసటి రోజు నుండి వ్యతిరేకించటం మొదలుపెట్టారు.

 

 

క్షేత్రస్ధాయిలో  పరిస్ధితులను గమనిస్తే కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరికి మద్దతుగానే కన్నా కూడా జగన్ ను వ్యతిరేకిస్తున్న విషయం అందరీకీ అర్ధమవుతోంది.  ఒకవైపు మరో రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావేమో  రాజధానుల విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నా సుజనా, కన్నా పట్టించుకోవటం లేదు.

 

ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదన్నారు. పనిలో పనిగా రాజధానుల విషయంలో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కారణాలేవైనా కిషన్ రెడ్డి హెచ్చరికలు కన్నాపై బాగానే పనిచేశాయని అర్ధమవుతోంది. అందుకనే తాజాగా కన్నా యూటర్న్ తీసుకున్నారు.

 

రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఉద్దేశ్యమే అని చెప్పారు.  రాజధానుల విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది ? అని ఎదురు ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. పైగా కేంద్రం జోక్యం ఉంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదని బుకాయించటమే ఆశ్చర్యంగా ఉంది.  జగన్ ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కేంద్రప్రభుత్వం చూస్తు ఊరుకోదని పదే పదే హెచ్చరించిన విషయాన్ని కన్నా మరచిపోయినట్లున్నారు.

 

మొత్తానికి  రాజధానుల తరలింపు విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కన్నా విషయంలో బిజెపి ఢిల్లీ నాయకత్వం ఘాటుగానే హెచ్చరించినట్లు సమాచారం. రాజధానుల తరలింపు అన్నది రాష్ట్రప్రభుత్వ నిర్ణయమని తెలిసినా కన్నా దూకుడుగా ఎందుకు మాట్లాడుతున్నారనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనల వెనుక సుజనా ప్రోద్బలం ఉందనే విషయంలో అనుమానించినట్లు సమాచారం. అందుకనే యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: