ఒక్కో మతం ఒక్కో దేవుడిని పూజిస్తుంది. మన లౌకిక దేశంలో ఎవరి మతం వారు పాటించుకోవచ్చు. అయితే.. పొరుగు దేశాల నుంచి వచ్చిన మతాలు.. ఇక్కడి వారి జీవన విధానంలో భాగం అవుతున్నాయి. అయితే ఎంతైనా అవి పొరుగు దేశాల మతాలు అవుతాయని అనుకుంటున్నారో.. లేదా.. ఇక్కడి దేవుళ్లకు పోటీగా తయారు చేస్తున్నారో.. లేదా.. ఇక్కడి జనాలను ఆకట్టుకోవాలనుకుంటున్నారో కానీ.. ఆయా మతాలపై హిందూ మత ప్రభావం బాగా ఉంటోంది.

 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలో ఓ ఏసుభక్తుడు.. ఆయన చర్చిని అచ్చం హిందూ దేవాలయంగా నిర్మించాడు. హిందూ ఆలయంలా నిర్మించి గర్భగుడిలో ఏసు, మేరీ మాత విగ్రహాలు ప్రతిష్టించాడు. అంతే కాదు.. ఆ ఓ ధ్వజస్థంభం కూడా నిర్మించారు. అచ్చం ఆ నిర్మాణ శైలి, గోపురాలు అంతా హిందూ దేవాలయమే.. దీన్ని బయట నుంచి చూస్తే ఎవరూ చర్చి అనుకోరు. ఏ హిందూ దేవాలయమో అనుకుంటారు.

 

హిందూ దేవుళ్ల తరహాలోనే పూజలు కూడా ఉంటాయని చెబుతున్నారు. వీలయితే రాను రాను అభిషేకాలు, సహస్ర నామార్చనలు, దండకాలు, ప్రదక్షిణలు, కొబ్బరికాయలు, తీర్థప్రసాద వితరణ, తిలకధారణ గట్రా కూడా మొదలవుతాయేమో అనుకుంటున్నారు స్థానికులు. హిందూ మతంలోని కొన్ని అవలక్షణాల కారణంగా, వివక్షకు గురయ్యే వర్గాలు ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం వల్లే ఇలాంటి దేవాలయాలు వెలుస్తున్నాయంటున్నారు కొందరు విశ్లేషకులు.

 

మన భారతీయులు.. నచ్చితే దేన్నైనా తమలో కలిపేసుకుంటారు. గతంలో ఇలాగే బౌద్ధాన్ని తమ హిందూ ధర్మంలో కలిపేసుకున్నారు. బుద్ధుడిని కూడా దేవుడిని చేసేశాడు.. ఆయన వద్దన్నా విగ్రహాలు పెట్టేశారు. పూజలకే వ్యతిరేకమైన బుద్ధుడిని కూడా ఘనంగా పూజించేశారు. ఇప్పుడు ఈ ఏసుక్రీస్తు గుడి కూడా అంతేనేమో మరి. అంతేనా.. దేవా..?

మరింత సమాచారం తెలుసుకోండి: