అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత నరేంద్ర మోడి వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏలోకి రావాల్సిందిగా ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. బలమైన రాష్ట్రాల్లో పోయిన ఏడాది బిజెపి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు సుమారు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమలం పార్టీ బలం దారుణంగా పడిపోయింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఏమంత బలమైనవి కాకపోవటంతో మోడి ఆత్మరక్షణలో పడిపోయినట్లు సమాచారం.

 

అయితే మోడి ఆఫర్ కు జగన్ నో చెప్పారట. ఎన్డీఏలో చేరి కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకునేకన్నా తన దృష్టి ప్రత్యేకహోదా సాధనపైనే ఉందని స్పష్టంగా చెప్పారట. ఎన్డీఏలో చేరిన తర్వాత తమకిచ్చే మంత్రి పదవులకన్నా హోదా ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మోడితో జగన్ సున్నితంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడినట్లు జగన్ కు సూచించారట.

 

మోడి సూచన కారణంగానే అమిత్ షా తో భేటి అయ్యేందుకు జగన్ ఈరోజు ఢిల్లీకి చేరుకుంటున్నట్లు పార్టీ నేతలంటున్నారు.  మోడి ఏమో దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన మిత్రుడి కోసం వెతుకుతున్నది వాస్తవం. కర్నాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నా అదేమీ సొంతబలంతో  వచ్చింది కాదు. ప్రత్యర్ధి పార్టీల్లోని ఎంఎల్ఏలను కొనేసి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  కాబట్టే గట్టి మిత్రుడికోసం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.

 

అన్నీ కోణాల్లో ఆలోచిస్తే జగన్ కన్నా బలమైన మిత్రుడు ఇంకోరు కనబడలేదు. అయితే ప్రత్యేకహోదా రాకుండా జగన్ గనుక ఎన్డీఏలో చేరి మంత్రిపదవులు తీసుకుంటే మరో చంద్రబాబునాయుడు లాగ మిగిలిపోవటం ఖాయం. ఏపికి ఏవిధంగాను లాభం జరగకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందనటంలో సందేహం లేదు. అందుకనే జగన్ కూడా ప్రాక్టికల్ గా వ్యవహరిస్తున్నారు. మరి అమిత్ షా తో భేటిలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: