అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేటి నుండి ప్రారంభం కానుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు ట్రంప్ కుటుంబం ఈరోజు మధ్యాహ్నం చేరుకోనున్నారు. ట్రంప్ తో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కూడా ఇండియాకు రానున్నారు. ట్రంప్ కుటుంబంతో పాటు భారత్ తో కీలక అంశాలలో జరిగే చర్చల్లో పాల్గొనటానికి ఉన్నతస్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. 
 
నిన్న రాత్రి వాషింగ్టన్ నుండి ఎయిర్ ఫోర్స్ విమానంలో సతీసమేతంగా ట్రంప్ బయల్దేరారు. ట్రంప్ బయలుదేరే ముందు అక్కడి మీడియాతో మాట్లాడారు. మోదీ తనకు మంచి మిత్రుడని మోదీతో సమావేశం కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. భారత ప్రజలను కలుసుకునేందుకు ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇది తాము కనీవినీ ఎరుగని గొప్ప కార్యక్రమం అవుతుందని మోదీ తనతో చెప్పారని అన్నారు. 
 
లక్షలాది మంది భారత దేశ ప్రజలను తాము కలుసుకోబోతున్నామని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆ తరువాత మోతెరా స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ట్రంప్ ప్రసంగించనున్నారు.దాదాపు 28 కిలో మీటర్లు రోడ్ షో జరగనుంది. 
 
ఈ రోడ్ షో లో వేలాది మంది ప్రజలు ట్రంప్ కు ఘన స్వాగతం పలుకుతారు. ఆ తరువాత కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శిస్తారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్ మహల్ ను కేంద్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. రేపు ఉదయం అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్ లో అధికరిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. భారత్ లో దాదాపు 36 గంటలపాటు ట్రంప్ గడపనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: