ఇంత తొందరగా వైసిపిలో కంపు మొదలైపోతుందని ఎవరూ అనుకోలేదు. అధికారంలోకి వచ్చిన మరీ తొమ్మిది నెలల్లోనే ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరాటాలు వీధిల్లోకి ఎక్కటమే విచిత్రంగా ఉంది.  పైగా ఆధిపత్య పోరాటాలు కూడా ఎవరో సీనియర్ల మధ్య అనుకుంటే ఏమోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ మొదటిసారి ఎన్నికల్లో పోటి చేసి గెలిచిన యువతరం మధ్య గొడవలు ముదిరిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజమండ్రిలో మార్గాని భరత్ కు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎంఎల్ఏలతో పడటం లేదట. అలాగే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొందరు ఎంఎల్ఏలతో ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలకు  ఏమాత్రం పొసగటం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వీళ్ళ మధ్య గొడవలతో దిగువస్ధాయి నేతలతో పాటు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ ఇబ్బంది ఒకరకమైతే అధికారులు నలిగిపోవటం మరో రకమైన సమస్య.

 

రాజమండ్రిలో ఎంపికి ఎంఎల్ఏలకు మధ్య ప్రోటోకాల్ సమస్య ముదిరిపోయిందట. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ముందుగా తన పేరుండాలని ఎంపి పట్టుబడుతున్నట్లు సమాచారం. కానీ ప్రోటోకాల్ ప్రకారం ముందు స్ధానిక కార్పొరేటర్, తర్వాత మేయర్, ఆ తర్వాత ఎంఎల్ఏ మళ్ళీ మంత్రి చివరగా ఎంపి పేరుండాలి. కానీ ప్రోటోకాల్ కు ఎంపి రివర్సులో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ఎంఎల్ఏలతో ఎంపికి ఏమాత్రం పడటం లేదట.

 

ఇక లావు సంగతి తీసుకుంటే చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజనితో ఏమాత్రం పడటం లేదు. రజని ఎవరినైతే దూరంగా పెడుతోందో వాళ్ళతో ఎంపికి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో రజని-ఎంపి మధ్య రోజు రోజుకు గొడవలు పెరిగిపోతున్నాయి. రజనీ కూడా తాను మొదటిసారి ఎంఎల్ఏ అయిన విషయాన్ని మరచిపోయి సీనియర్, మాజీ ఎంఎల్ఏ అయిన మర్రి రాజశేఖర్ తో గొడవ పడుతోందని ఆరోపణలున్నాయి.

 

సరే ఇటువంటివే నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకు కొందరు ఎంఎల్ఏలకు, చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వర్గానికి పడటం లేదనే ప్రచారం ఉంది. మొదలైన అంతఃకలహాల విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే దృష్టి పెట్టకపోతే వ్యవహారం  మరింత కంపైపోవటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: