ఒక పార్టీ అన్నాక అందరినీ ఓకే తాటిన నడిపించడం కష్టం.. నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అభిప్రాయబేధాలు సహజమే. అసలు ప్రజాస్వామ్యం పరిఢవిల్లేదే ఇలాంటి భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉన్నప్పుడే. కానీ అదే భిన్నాభిప్రాయాలు కాస్తా విబేధాలకు దారి తీస్తే... చివరకు ఆ నాయకుల ధోరణి పార్టీకే చేటు చేస్తే.. అప్పుడే పార్టీ నాయకత్వం క్రియాశీలకంగా మారాలి. ఆ గొడవలు తీర్చి నాయకులను దారిలో పెట్టాలి.

 

 

కానీ ఇప్పుడు వైసీపీలో ఆ సర్దుబాటు యంత్రాంగం అంతగా పని చేస్తున్నట్టు లేదు. జిల్లాల్లో నాయకుల మధ్య కుమ్ములాటలు పెరుగుతున్నాయి. అంతే కాదు.. ఏకంగా వారు మీడియా ముందుకెక్కి మరీ రచ్చ రచ్చ చేసుకునే సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే విడదల రజినీకీ.. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వర్గాలకూ పడటం లేదు. ఎన్నికల ముందు నుంచి వీరిమధ్య విబేధాలు ఉన్నాయి. చివరకు ఇవి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇటీవల విడదల రజినీ మరిది కారుపై దాడి జరిగింది.

 

 

తాజాగా అనంతపురం జిల్లాలో హిందూపురం నేత ఇక్బాల్ కూ ఇంటిపోరు అధికమైంది. ఆయన ఏకపక్షంగా వెళ్తున్నారంటూ పోటీ వర్గం నేతలు ఏకంగా ప్రత్యేకంగా సభలు నిర్వహించుకునే స్థాయికి వెళ్లింది. మీడియాలో రెండు, మూడు రోజులుగా ఈ రెండు వర్గాల కుమ్ములాటలు పతాక శీర్షికలకు ఎక్కువతున్నాయి. చివరకు రెండు వర్గాలు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసే స్థాయికి చేరుకున్నారు.

 

 

అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఆ మధ్య తోట నర్సింహం, మంత్రుల కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలే చెప్పులతో దాడి చేసుకున్న ఘటన కూడా కలకలం సృష్టించింది. ఇలాంటి విబేధాలు అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. అది సహజం కూడా కానీ.. విబేధాల వార్తలు పొడచూపిన వెంటనే.. ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగితే.. అది మీడియాకు ఎక్కే అవకాశం తక్కువ. వైసీపీలో ఆ ట్రబుల్ షూటర్లు ఇప్పుడు మరింత క్రియాశీలకలం కావాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: