కరోనా ..  ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు.  ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్‌... ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.  ఇలాంటి సమయంలో ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.  వైరస్‌ సోకలేదంటూ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని పలు కంపెనీలు నిబంధన పెట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

 

చాపకింద నీరులా వ్యాపించిన కరోనా... ఇప్పుడు శర వేగంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించి... వేల మందిని బలి తీసుకుంది. దీంతో భారత్‌... కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇతర దేశాల నుంచి వస్తున్నవాళ్లకు ఎయిర్‌పోర్టులోనే స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. అంతేకాదు చైనా నుంచి వచ్చిన ఇండియన్స్ ను నేరుగా ఇంటికి పంపకుండా రెండు వారాల పాటు ఆర్మీ క్యాంపుల్లో ఉంచి ఐసోలేషన్‌లో పెట్టారు. అయితే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనంలో మాత్రం ఆందోళన తగ్గటం లేదు.  దీంతో కరోనా బాధిత దేశాల నుంచి వచ్చిన వాళ్లను ఇప్పుడు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. 

 

మన దేశంలో చైనా, జపాన్‌కు చెందిన కంపెనీలు చాలానే ఉన్నాయి.  ముఖ్యంగా కార్ల కంపెనీలు.. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. .అయితే కొన్ని సార్లు సమావేశాల కోసం ఇక్కడి నుంచి ప్రతినిధులు చైనా , జపాన్ వెళ్లొస్తూ ఉంటారు.  అలాంటివారిని ఇప్పుడు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. 

 

కరోనా అలెర్ట్ నేపథ్యంలో  ఇప్పటికే భారత్‌లో వైద్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉంది.  ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల్లో కరోనా నోడల్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇక తెలంగాణా విషయానికి వస్తే గాంధీ ఆస్పత్రిని కరోనా నోడల్ సెంటర్ గా ఏర్పాటు చేశారు. అనుమానితులు ఎవరైరనా వస్తే వెంటనే గాంధీలో టెస్టులు చేస్తున్నారు. అయితే కరోనా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అనే మాట అసలు వద్దంటున్నారు డాక్టర్లు. అనుమానం ఉంటే రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉండాలంటున్నారు.

 

మొత్తానికి చైనా, జపాన్ ల నుంచి వస్తున్న వాళ్లను.... ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు ఊరికే వదలటం లేదు. ఫిట్నెస్ సర్టిపికెట్ ఖచ్చితంగా కావాలంటున్నారు. దీంతో వారు ఆస్పత్రుల వెంట తిరుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: