ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో  హైడ్రామా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పేసి బీజేపీ పార్టీలో చేరడం... ఇక జ్యోతిరాదిత్య సింధియా వెంట ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ప్రస్తుతం కమల్ నాథ్ ప్రభుత్వ సంక్షోభం  ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన 22 మంది ఎమ్మెల్యేలను బిజెపి బెంగళూరులోని ఓ రిసార్టులో ఉంచి  రాజకీయాలు నడుపుతున్నది అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. అయితే పార్టీ నుంచి ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు వీడడంతో ముఖ్య మంత్రి కమల్ నాథ్  మరోసారి ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు బలపరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఈ నేపథ్యంలోనే సోమవారం  అసెంబ్లీలో కమల నాథ్  పరీక్ష చేయాల్సి ఉంది... మరోవైపు గవర్నర్ బలపరీక్షను నియమాల ప్రకారం ఈరోజే చేపట్టాలని పట్టుబట్టినప్పటికీ తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే బల పరీక్ష వాయిదా పడడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలి అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్ పైన దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సహా స్పీకర్ గవర్నర్లకు తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై తక్షణమే వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.

 

 

 అయితే సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ మొదలైనప్పుడు గవర్నర్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గవర్నర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం లో భాగంగా సోమవారం సభను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ లాల్జీ  టాండన్... బలపరీక్ష తక్షణమే జరపాలి అంటూ స్పీకర్ ను  కోరగా... బలపరీక్షకు గవర్నర్ కు ఎలాంటి సంబంధం లేదని... సభను గౌరవించాలి అంటూ కాంగ్రెస్ సభ్యులందరూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు బిజెపి ఎమ్మెల్యేలు అభ్యంతరాల మధ్య గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరి మధ్యప్రదేశ్ లో ఏర్పడిన సంక్షోభం పై సుప్రీం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: