సోషల్ మీడియా ద్వారా నిత్యం అనేక కోట్ల వార్తలు అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాయి. అందులో చాలా వరకూ ఫేక్ ఉండటం ఇప్పుడు పెద్ద ప్రమాదకంగా మారింది. తెలిసీ తెలియక కొందరు.. కావాలని కొందరు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారు. అలాంటిదే ఈ వార్త కూడా. ఇటీవల కరోనా సాయం కింద ప్రధాన మంత్రి మోడీ పేదల అకౌంట్లలో రూ. 500 రూపాయల సొమ్ము జత చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఈ సొమ్ము అకౌంట్లలో వేశారు.

 

 

అయితే ఈ సొమ్ము అకౌంట్లలో వచ్చాయో లేదో.. తెలుసుకునేందుకు జనం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. దీని ద్వారా అసలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన లాక్ డౌన్ లక్ష్యం నీరు గారి పోతోంది. దీనికి తగ్గట్టు కొందరు ఆకతాయిలు.. ఈ సొమ్ము వెంటనే తీసుకోకపోతే మళ్లీ వెనక్కు వెళ్లిపోతోందని వదంతులను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తి గా అవాస్తవం.

 

 

ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దని.. పేదల ఖాతాల వేసిన డబ్బు వెంటనే విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. డబ్బు విత్ డ్రా చేసుకోనంత మాత్రాన ఖాతాల నుంచి వెనక్కు వెళ్లిపోతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పింది.

 

 

ఇలాంటి ఆకతాయిల గురించి.. ఇలాంటి వదంతుల గురించి సమాచారం ఉన్నా..అలాంటి సందేశాలు మీకు వచ్చినా వెంటనే పోలీసులకు తెలపాలని సూచించింది. సో.. ఎవరికైనా ప్రభుత్వం నుంచి కరోనా పరిహారం సొమ్ము మీ ఖాతాలో వస్తే వెంటనే కంగారు పడి బ్యాంకులు పరుగులు తీయాల్సిన అవసరం అస్సలు లేదు. తప్పుడు వార్తలు నమ్మి అనవసరంగా కంగారు పడి బ్యాంకుల వద్ద గుమిగూడి కరోనా వ్యాప్తికి కారణం కాకండి.. ఇలాంటి వదంతులను మీ ఫోన్లకు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మార్డ్ చేయకండి. అర్థమవుతోందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: