ముందు మనం.... తర్వాతే అందరం.. అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. కలిసుంటే కలదు సుఖమనేది ఒకప్పటిమాట...! తమ  తర్వాతే చూసుకున్నాకే ఇతరులు.. అంటున్నాడు ట్రంప్. కరోనా విషయంలో ఆలస్యంగా మేల్కొని ఫలితం అనుభవిస్తున్న ట్రంప్‌... దిద్దుబాటు పనిలో పడ్డాడు. కరోనాని మించి నిరుద్యోగం విజృంభించడంతో... తక్షణ చర్యల్లో పడ్డాడు. 

 

కరోనాతో అమెరికా అల్లకల్లోలమయ్యింది. అగ్రరాజ్యం... ఆకలిరాజ్యంగా మారింది. లక్షల ఉద్యోగాలు ఊడాయి. నిరుద్యోగం కరోనాని మించిన టెన్షన్‌ పెట్టింది. అమెరికాలో దాదాపు 8 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 42 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఫలితాలనివ్వలేదు. విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

 

కరోనాను కంటికి కనిపించని శత్రువు దాడిగా అభివర్ణించిన ట్రంప్‌... అమెరికా పౌరుల ఉద్యోగాల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో రికార్డు స్థాయిలో లేఆఫ్‌లు ప్రకటించాయి కంపెనీలు. దీంతో 2 కోట్ల 20 లక్షల మంది నిరుద్యోగులు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సాధారణ విసా సేవల్ని నిలిపివేసింది అమెరికా. ఇప్పుడు ప్రయాణాలపైనా ఆంక్షలు విధించడం, భారత్‌ సహా పలు దేశాల్లో కాన్సులేట్‌ సేవల్ని ఆపివేయడం వల్ల H-1B వీసాల జారీపై తీవ్ర ప్రభావం పడనుంది. 

 

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి... పరిస్థితులు కుదుటపడిన తర్వాత కూడా.. ఉద్యోగాల నియామకాల్లో అమెరికన్లకే ప్రధాన్యమివ్వాలని భావిస్తోంది అమెరికా. దీంతో... భారతీయులకు అమెరికా వెళ్లే దారి మూసుకుపోయినట్లే. 

 

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి బ్యాక్‌ టూ పెవీలియన్‌ అంటూ ఇండియా వచ్చిన వారికీ అంతకు మించి కష్టాలే. హైదరాబాద్‌లో ఉన్న టెక్కీలకే ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాత్రికి రాత్రి మెయిల్స్‌ వస్తూ... టర్మినేట్‌ చేస్తున్నారు. కొందరిని లీవ్స్‌ తీసుకోమని చెప్పి.. అవసరం ఉన్నప్పుడు తామే పిలుస్తామంటున్నారు. ఇలాంటి తరుణంలో... ఇక్కడున్న వారే ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నప్పుడు ఇతర దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వచ్చిన ఇండియన్స్‌కి  ఉద్యోగాలు దొరకడం కష్టతరమే. దొరికినా... ఇంతకుముందున్న ప్యాకేజీ అసలే రాదు. సర్ధుకుపోయి ఎంతోకొంత జీతానికి ఉద్యోగంలో చేరడం తప్ప వేరే దారిలేదు.

 

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ కు అడ్డుకట్ట పడింది. మరి ఇండియన్స్ పరిస్థితేంటన్నదే అసలు సమస్య. లెట్స్‌ గో యూఎస్‌ అనే వారిలో చైనా తర్వాత ఎక్కువగా ఇండియన్సే. ఎంఎస్‌, ఎంటెక్‌, ఎంబీఏ, జాబ్స్‌, రీసర్చ్‌లంటూ చైనా, ఇండియాకు చెందిన వారి వలసే అమెరికాలో ఎక్కువ. 

 

అమెరికా వర్సిటీల నిర్వహణ వ్యయంలో 60 శాతాన్ని వలస విద్యార్థులే చెల్లిస్తున్నారనేది ఓ అంచనా. వలసలకు అడ్డుకట్ట వేస్తే.. వర్సిటీలకు ఆర్థిక కష్టాలు తప్పవనే వాదన కూడా ఉంది. అందుకే వలసలపై నిషేధం తాత్కాలికమని ట్రంప్ చెబుతున్నా... మరో ఏడాది వరకూ కష్టమేనన్న సంకేతాలు లేకపోలేదు. 

 

ఏటా భారీ సంఖ్యలో వచ్చే వలసదార్లు తక్కువ జీతాలతో అత్యుత్తమంగా పనిచేయడం కారణంగా.. అమెరికా కంపెనీలకు భారీ లాభాలొస్తున్నాయి. అదే పని అమెరికన్లతో చేయించుకుంటే.. ఎక్కువ జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే అసలే కరోనాతో మూలుగుతున్న అమెరికా కంపెనీలపై తాటి పండు పడ్డట్టే. మరి ట్రంప్ ఏం ఆలోచించి వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

 

అయితే ఈ ఏడాది ఆఖరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల తరుణంలో ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన తెరపైకి వస్తోంది. మేక్ అమెరికా.. గ్రేట్ ఎగైన్..! నినాదంతో అధ్యక్షుడిగా నెగ్గిన ట్రంప్.. మరోసారి లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టడానికే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారనే వారూ లేకపోలేదు. 

 

ప్రపంచంలో మరే ఇతర దేశంతో అమెరికాకు పోలిక లేదు. ఎందుకంటే మరే దేశం అమెరికా లాగా పూర్తిగా వలసదార్లతో ఏర్పడలేదు. వలసదార్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలోనే కాదు.. దేశ నిర్మాణంలోనూ విడదీయలేని భాగంగా మారారు. అసలు వలసదార్లు లేకుండా అమెరికా వృద్ధి లేదని కూడా కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు. చూడాలి మరీ మన్ముందు ట్రంప్ ఏం చేయనున్నారో.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: