ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మరోవైపు కరోనా నుంచి కోలుకుని భారీ సంఖ్యలో కరోనా రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు. 
 
ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 87 మంది, కర్నూలు జిల్లా నుంచి 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 321 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. గత మూడు రోజుల నుంచి కర్నూలులో తక్కువగా కేసులు నమోదు కాగా ఈరోజు ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి. 
 
మూడు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నా మిగతా జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టడం గమనార్హం. రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా మరికొన్ని రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కరోనా కొత్త మరణాలు నమోదు కాలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 31 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా... ప్రధాని మోదీ ప్రకటన అనంతరం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ మరో రెండు వారాలు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: