తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతుంటే.. టెస్టులు ఎక్కువగా చేయకపోవడం వల్లే కేసులు బయటపడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే కరోనా వంటి మహమ్మారి రోగాల విషయంలో ప్రభుత్వాలు చెప్పే సమాచారమే ప్రామాణికంగా భావించాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ సర్కారు చెబుతున్న లెక్కలు చూస్తే తెలంగాణలో నాలుగు జిల్లాలు కరోనాకు కేరాఫ్ గా మారాయని తేలుతోంది.

 

 

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే వస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయిస్తున్నామని వారు అంటున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తి కాంటాక్ట్ లను క్వారంటైన్ చేస్తున్నామంటున్నారు.

 

 

తెలంగాణలో కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసులన్నీ ఎక్కువగా జీహెచ్ ఎంసీ పరిధిలోనే వస్తుండటం హైదరాబాద్ నగరవాసులను భయకంపితులను చేస్తోంది. తెలంగాణలో బుధవారం 11 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. తాజాగా 20 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు 648 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు.

 

 

విశేషం ఏంటంటే.. బుధవారం నమోదైన పదకొండు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. అందుకే కరోనా వైరస్ వ్యాప్తి అదికంగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలు, గుంటూరు సరిహద్దు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: