దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడంలేదు. మరోవైపు ఇప్పటికే పలు దేశాల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు సాధించడంతో త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. 
 
వాస్తవంగా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడొస్తుందో తెలీదు కానీ వచ్చేస్తుందనే ప్రచారం మాత్రం భారీగా జరుగుతోంది. నిన్ననే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు సాధించింది. రష్యా ఆగష్టు నెల 3వ తేదీన వ్యాక్సిన్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. సాధారణంగా వ్యాక్సిన్ కు విడుదల చేయాలంటే వివిధ దశల్లో 18 నెలల పాటు పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. 
 
అయితే ప్రస్తుతం ట్యాబ్లెట్లకు, ఇంజక్షన్లకు చేసే పరిశోధనల్లాగే వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ముందుగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించి వైరస్ సోకగానే యాంటీ బాడీలు విడుదలై నాశనం చేయాలి. అయితే పూర్తిస్థాయి పరిశోధనలు జరగకపోతే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్స్ ఫర్డ్ టీకా తీసుకుంటే తలనొప్పి, మైగ్రేన్, కళ్లు తిరగడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 
రష్యా, భారత్ కు చెందిన భారత్ బయోటెక్, బ్రిటన్ వ్యాక్సిన్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో 100 శాతం ఫలితాలు సాధించే వ్యాక్సిన్ ను ఏ దేశం మొదట అందుబాటులోకి తీసుకొస్తుందో చూడాల్సి ఉంది. వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే అది తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారంగా ఉండాలి. మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: