గత 8 నెలల నుంచి ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. శాస్త్రవేత్తలు ఎంత శ్రమించినా వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. షేక్ హ్యాండ్ ఇచ్చినా కరోనా సోకే అవకాశం ఉండటంతో చాలా మంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
 
అయితే మరికొన్ని రోజుల తరువాత షేక్ హ్యాండ్ ఇస్తే కరోనా సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు కస్తూరి శివప్రసాద్‌ షేక్ హ్యాండ్ ఇచ్చినా కరోనా సోకకుండా శానిటైజ్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను తయారు చేశాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు శివప్రసాద్ నిన్న ఈ గ్లౌజులను చూపించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శివ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.           
 
కరోనా భయంతో కరెన్సీ నోట్లు పట్టుకునేందుకు కూడా చాలా మంది పడుతున్నారని శివప్రసాద్ చెప్పాడు. శానిటైజ్‌ హ్యాండ్‌గ్లౌజ్‌ల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నాడు. ఈ హ్యాండ్‌ గ్లౌజ్‌లో 50 మిల్లీ లీటర్ల శానిటైజర్ ఉంటుందని... షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన ప్రతిసారి శానిటైజర్‌ విడుదల అవుతుందని... గ్లౌజ్ వేసుకున్న తరువాత ఏవి పట్టుకున్నా కరోనా సోకదని అన్నారు.
 
పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారస్తులకు ఈ గ్లౌజ్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు. జత గ్లౌజ్‌లు తయారు చేయడానికి దాదాపు 800 రూపాయల ఖర్చు అయినట్లు ఆయన తెలిపాడు. మరోవైపు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైరస్ ను నాశనం చేసే మాస్క్ లు, తక్కువ ధరకే పీపీఈ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: