జగన్ సర్కారులో దళితులకు రక్షణ లేదు.. దళితులపై దాడులు పెరిగాయి.. దళితులను చంపేస్తున్నారు.. దళితులను శిరోముండనం చేస్తున్నారు.. ఇలా ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరహా వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం అంటున్నారు వైసీపీ నాయకులు.. చంద్రబాబు చేసే ప్రచారానికి ఎల్లో మీడియా అధిపతులు, జర్నలిస్టులు వంత పాడుతున్నారని వైసీపీ అధికారప్రతినిధి టేజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.

 
ముఖ్యమంత్రి జగన్‌ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆరోపిస్తున్నారు. తన పాలనలో దళితుల భూములు లాక్కున్న చంద్రబాబుకు ఇప్పుడు వారిపై  ప్రేమ పుట్టుకొచ్చింద‌ని సుధాకర్ బాబు విమర్శిస్తున్నారు.  సీఎం వైయ‌స్ జగన్‌కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నార‌ని సుధాకర్ బాబు మండిపడ్డారు.


రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, సాంబశివరావు, వెంకటకృష్ణ ఈ విషయంలో చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నార‌ని సుధాకర్ బాబు అంటున్నారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి వెంకట కిషోర్, నిమ్మగడ్డ రమేష్‌ వంటి అధికారులకు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని వీరంతా కలసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దింపార‌ని సుధాకర్ బాబు గుర్తు చేస్తున్నారు.  అధికారం కోల్పోయిన చంద్రబాబును ఈ శక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. తమ దోపిడీకి చంద్రబాబు ద్వారా రాచమార్గం వేసుకోవాలని చూస్తున్నారని, పంచ భూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారని సుధాకర్ బాబు అంటున్నారు.  


తన హయాంలో దళితులను అణగదొక్కిన చంద్రబాబు.. ఇప్పుడు ద‌ళితుల‌పై క‌ప‌ట ప్రేమ చూపుతున్నార‌ని సుధాక‌ర్‌బాబు విమ‌ర్శించారు. దళితులపై వైయ‌స్ఆర్ ‌సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు  చంద్రబాబు కట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. నిప్పు లేకుండా పొగ రాజేయడం కష్టం.. అందుకే అసలు విషయం లేకుండా ఎవరూ ఏ ప్రచారాలు చేసినా పెద్దగా ఫలించవు. అందుకే వైసీపీ పెద్దలు కూడా తమ నేతలను, కార్యకర్తలను కట్టడి చేసుకోవాలి. ఇలాంటి వివాదాలు అసలు తలెత్తకుండా చూసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: