గ్రేటర్ లో వేలకోట్ల సొమ్ముతో ఎంతో అభివృద్ధి తీసుకొచ్చామని... గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెమటలు పట్టే విధంగా బిజెపి నాయకులు ప్రసంగాలతో గ్రేటర్ లో అగ్గి రాజేస్తున్నారు. బిజెపికి మరింత బలం చేకూర్చే దిశగా..తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు గ్రేటర్ లో తన ప్రసంగంతో సందడి చేస్తూ... కారు గుర్తుపై కన్నెర్ర చేశారు. బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో కూకట్ పల్లి లో రోడ్ షో నిర్వహించగా... ఈ సందర్భంగా గళమెత్తిన యోగి టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అసలు టిఆర్ఎస్ చెబుతున్న అభివృద్ధి కి... వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందని విమర్శలు చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి పరిచిన మాట అటుంచితే..... ఆ రెండు పార్టీలు అభివృద్ధికి అడ్డంకిగా నిలబడ్డారు అంటూ వ్యాఖ్యానించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కబ్జా చేశారని ఇందులో ఏ మాత్రం అసత్యం లేదని, అభివృద్ధికి ఆటంకం కలిగించే ఇలాంటి పనులు ఎన్నో చేశారని.... ప్రజలు వీటిపై స్పందించాలి... ఈ నిజాం వారసులకు తగిన గుణపాఠం నేర్పించాలని యోగి ప్రజలను కోరారు.
అంతేకాదు హైదరాబాద్ పై కన్నేసిన ఓ కుటుంబం భాగ్యనగరాన్ని భారీగా దోచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది అని... అటువంటి వారికి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. భాగ్యనగరాన్ని బంగారు నగరం గా మార్చాలంటే పెద్ద విషయం కాదని.. కాకపోతే అందుకు ప్రజలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ ఎంతటి అభివృద్ధిని సాధించిందో మాటల్లో చెప్పలేమని.... అక్కడ తమ ప్రభుత్వం అర్హులైన ప్రజలకు 30 లక్షలకుపైగా ఇళ్లు కట్టించింది అని, టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆరేళ్ల పరిపాలన కాలంలో ఎంత మంది పేదలకు ఇళ్లు కట్టించిందో వివరాలతో సహా చెప్పాలంటూ ప్రశ్నించారు యోగి. అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో ఉండాలని అది గమనించి ప్రజలు తమ నేతలను ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఇలా పలు అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలపై యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి