వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోనున్న ట్రంప్‌ మరో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటనను ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో అగ్రరాజ్య చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్‌ అపఖ్యాతి పాలయ్యారు. ఇప్పటికే హౌస్‌ను దాటిన అభిశంసన.. తర్వాత సెనేట్‌కి వెళ్లనుంది.

కేపిటల్‌ హిల్‌పై దాడికి ఉసిగొల్పిన ట్రంప్‌ను 25వ రాజ్యాంగ సవరణతోనే ఇంటికి పంపాలని డెమొక్రాట్లు ప్రయత్నించారు. ప్రతినిధుల సభలో తీర్మానం పెట్టి ఆమోదించారు. సెక్షన్‌ 4 అధికారాలను వినియోగించి ట్రంప్‌ను గెంటేయాలని చెప్పారు. కానీ మైక్‌ పెన్స్‌ తిరస్కరించారు. దీంతో రెండో అస్త్రాన్ని బయటికి తీశారు డెమొక్రాట్లు. ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పెట్టారు. దీనిపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. హౌస్‌ మళ్లీ ట్రంప్‌ను అభిశంసించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 232-197 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఏకంగా పది మంది రిపబ్లికన్లు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ తీర్మానం ఆమోదంతో అమెరికన్‌ పార్లమెంటులోని ప్రతినిధుల సభ అభిశంసన పూర్తయినట్లయింది. నెక్ట్స్‌ సెనేట్‌లోనూ ట్రంప్‌పై అభియోగాలు నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంటే ట్రంప్‌ భవిష్యత్తుపై స్పష్టత రానుంది. దీంతో ట్రంప్‌ విషయంలో సెనేట్‌ నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పుడు అమెరికన్‌ సెనేట్‌కు సెలవులు ఉన్నాయి. జనవరి 19నే తిరిగి సమావేశం కానుంది. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉంది. అంటే జనవరి 19న సమావేశమై ట్రంప్‌ భవిష్యత్తుపై సెనేట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్‌పై దాఖలైన అభియోగాలను సెనేట్‌ విచారించి నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయగానే ట్రంప్‌ వైట్‌హౌస్‌ వీడిపోవాల్సి ఉంటుంది.

ట్రంప్‌ అభిశంసనపై చర్చించేందుకు సెనేట్‌ అత్యవసరంగా భేటీ కావాలి. బైడెన్‌ పదవి చేపట్టే లోపే ట్రంప్‌పై చర్యలు తీసుకునేందుకు సెనేట్‌ను అత్యవసర సమావేశపరచాలని డెమోక్రాట్లు సెనేట్‌ మెజార్టీ లీడర్‌ మెక్‌కన్నెల్‌ను కోరారు.  దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆయన చెబుతున్నారు. ఈ నెల 19న సెనేట్‌ ప్రారంభమైన వెంటనే తీర్మానాలు తీసుకుంటే.. తర్వాత దానిపై విచారణ ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో దానికి వారాలు పట్టాయి. ఇప్పుడు మాత్రం హడావుడిగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారా..? అన్న ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: