ఈ విజయ ప్రస్థానం వెనుక అడుగడుగునా తల్లి విజయమ్మ తనదైన పాత్ర పోషించారు. జగన్‌కు మొదటి నుంచి అమ్మ విజయమ్మ దగ్గర బాగా చనువు.. తండ్రి రాజకీయాల్లో కీలకంగా ఉండే రోజుల్లో జగన్, షర్మిల బాధ్యతలన్నీ విజయమ్మే చూసుకునేవారు. దైవాన్ని బాగా నమ్మే విజయమ్మ.. ఎవరినీ అపకారం తలపెట్టకూడదని.. మనం నమ్మిన మార్గంలో ముందుకెళ్తే దైవం.. ఆయనే ఆశీర్వదిస్తాడని.. బలంగా నమ్మేది.. జగన్‌కు అదే చెప్పేది.. ఆమె ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే జగన్ వ్యక్తిత్వం తయారైంది.
ఒక్కసారి నమ్మితే చాలు.. ఎంతటి కష్టం వచ్చినా వెనుదిరగని జగన్ వ్యక్తిత్వానికి పునాది విజయమ్మే. తండ్రి అకాల మరణం తరువాత వైఎస్ఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను బాధ్యతగా తన కొడుకు తీసుకునేలా చేయడంలో విజయమ్మ పాత్ర కీలకం. ఆమె స్వయంగా జగన్ లేని సందర్భల్లో పార్టీని ముందుకు నడిపించారు. భర్త మరణంతో హఠాత్తుగా కొండంత అండను కోల్పోయినా గుండె నిబ్బరం సడలనీయని విజయమ్మ.. చేతికందిన కొడుకును విజయ ప్రస్థానంవైపు నడిపించారు.
ఎన్నో రాజకీయ ఎత్తుగడలు.. ఎందరో ప్రత్యర్థులు.. ఎన్నో వ్యుహాలు.. ఈ ధాటికి జగన్ జైలు పాలయ్యాడు. అయినా విజయమ్మ నమ్మకంలో అణువంతైనా తగ్గలేదు. మనో ధైర్యంతో అన్ని కష్టాలను అధిగమించి జగన్‌ను విజయవంతమైన నేతగా తీర్చిదిద్దారు. అందుకే అన్ని కష్టాలు అధిగమించి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆమె భావోద్వేగం అందరి హృదయాలను కదిలించింది. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం తప్పకుండా విజయమ్మే అని చెబుతారు ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసినవాళ్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి