భారతదేశమంతా కరోనా చేతిలో ఊపిరాడక రోజుకి వేలాదిమంది తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. అయినా మన ప్రభుత్వాలకు ఏమీ పట్టడం లేదు. కేసులు కూడా రోజుకి 4 లక్షలకు తగ్గకుండా వస్తున్నాయి. దీనితో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ లో వైద్య సదుపాయాలు సరిగా లేక కరోనా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  అయితే వీటన్నింటిలో ముఖ్యమైనది ఆక్సిజన్ సరఫరా, ఎంతోమంది రోగుల ప్రాణాలు పోవడానికి ఒకే ఒక్క కారణం ఆక్సిజన్ కొరత. దీనికి ప్రత్యేక్ష సాక్ష్యమే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఒక దుర్ఘటన. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది రోగులు మరణించినట్లు తెలుస్తోంది. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 10 మంది మరణించినట్లు ధ్రువీకరించారు.  దీనితో ఇప్పుడు ప్రజలకు ఈ హాస్పిటల్ పై నమ్మకం పోయింది. ముందు ముందు ఇదే విధంగా జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ దుర్ఘటనతో అన్ని హాస్పిటల్స్ ఆక్సిజన్ సరఫరా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని కోవిడ్ సెకండ్ వేవ్ వైద్య నిపుణులు చెబుతున్నారు. 



ఇందులో భాగంగానే త్వరితగతిన 49 ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ప్రకటించింది. దీనికి 309 కోట్ల ఖర్చు అవుతుందని ప్రణాళిక చేశారు. ఈ ప్లాంట్లు రానున్న మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతి ఘటన గురించి ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ రుయా హాస్పిటల్ లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ చెన్నై నుండి ఆక్సిజన్ రావడం ఆలస్యం కావడంతో  ఈ ప్రమాదం సంభవించిందని ప్రధానికి లేఖ రాశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆక్సిజన్ సరపరా స్థాయిని పెంచాలని, అంతే కాకుండా సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడాలని, అదే విధంగా మాకు 20 ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించాలని  లేఖలో పేర్కొన్నారు. అయితే మరోవైపు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అధికార పార్టీని విమర్శిస్తున్నారు. కరోనా మొదటి దశలో జరిగిన నష్టాన్ని చూసిన తరువాత కూడా ప్రభుత్వం నేర్చుకోలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో ముంబై ఒక మోడల్ గా ఉందని తెలుస్తోంది. ఇటీవలే సుప్రీం కోర్ట్ ఆక్సిజన్ విషయంలో ఇతర రాష్ట్రాలలా కాకుండా ముంబై ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కితాబిచ్చింది. 

ముంబై ని చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని చెప్పింది. అయితే ముంబై మోడల్ అంటే ఏమిటి అనే విషయం ఇప్పుడు అందరి మనసులో సందేహంగా నిలిచిపోయింది. మరి దీని గురించి తెలుసుకుందామా  ?   దీని గురించి తెలియాలంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను గురించి గుర్తు చేసుకోవాలి. గత సంవత్సరం మే, జూన్ నెలల్లో కరోనా మొదటి వేవ్ ధాటికి కేసులు పెరిగిపోయాయి. తద్వారా అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అప్పట్లో నగర కమిషనర్ గా ఉన్న వేలరసు కి ఆక్సిజన్ ను  సమకూర్చే బాధ్యతను అప్పగించారు. మాములు సమయంలో అయితే కేవలం ఐ సి యు లలో మాత్రమే ఆక్సిజన్ ఉపయోగించే అవసరం ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఆక్సిజన్ అవసరం రెట్టింపయ్యింది. అయితే ముంబై దగ్గర 13000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఒకటుండేది. దీని సహాయంతో మొత్తం 21 ఆక్సిజన్ ట్యాంకులను తయారు చేశారు. వీటిని ఉపయోగించి నగరంలో ఎక్కడ కూడా ఆక్సిజన్ అవసరం రాకుండా చేయగలిగామని చెబుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితి చేయిదాటిపోయింది. ఆక్సిజన్ డిమాండ్ అంతకంతకూ ఎక్కువయింది.  మాకు ఇక్కడ 210  టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఏర్పడింది. అయినప్పటికి మేము అప్పటికే సిద్ధం చేసుకుని ఆక్సిజన్ ట్యాంకర్లతో ఈ సమస్యను విజయవంతంగా అధిగమించామని వేలరసు చెప్పారు. 

దీని కోసం ప్రత్యేక ఆక్సిజన్ టీం పనిచేస్తూ ఉంటుంది. ఈ టీం లో మొత్తం ఆరుగురు అధికారులు, వార్డ్ ఆఫీసర్లు కలిసి ఆక్సిజన్ తయారుచేసే వారితో కలిసి పనిచేస్తారు. అంతే కాకుండా హాస్పిటల్స్ యొక్క ఆక్సిజన్ అవసరాలను తెలుసుకోవడానికి ఒక అధికారి టచ్ లో ఉంటారని కమిషనర్ వేలరసు తెలిపారు. ఈ బృందం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్ల ను కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా ఏప్రిల్ 17  న సమస్య వచ్చింది. కరోనా రోగులు ఎక్కువ మంది చేరడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. వెంటనే కొంతమంది రోగులను వేరే హాస్పిటల్స్ కు తరలించామని చెప్పారు. దీనితో అన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఆక్సిజన్ ఉండేలా చర్యలు తీసుకుంది. దీనితో ప్రతి 13 గంటలకు ఒకసారి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇందులో డాక్టర్స్ కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని వేలరసు తెలియచేశారు. ఇలా అత్యవసర సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించిన ముంబై ని సుప్రీం కోర్ట్ అభినందించింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు ముంబై ని మోడల్ గా తీసుకోవాలని సూచిందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: