మన జీవితం సాఫీగా సాగాలంటే ఎన్నో పరిశోధనలు సాగాలి. అందుకోసం సైంటిస్టులు నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో అద్భుత ఆవిష్కరణలు వెలుగు చూశాయి. కోట్ల మందికి పోషకాహారం అందించడం ఇప్పుడు ప్రపంచానికి ఓ సవాల్. దాన్ని అధిగమించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు సాగుతున్నాయి. కొన్ని అద్భుత ఫలితాలు అందిస్తున్నాయి. అలాంటి ఓ చక్కటి పరిశోధనను మన వరంగల్ సైంటిస్టులు సాగించారు. ఐరన్ లోపం అధిగమించేందుకు ఓ నూతన వరి వంగడాన్ని ఆవిష్కరించారు.  

ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా ‘డబ్ల్యూజిఎల్‌1119’ అనే వరి వంగడాలను తయారు చేశారు. బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఈ రకం బియ్యంలో ఐరన్‌ శాతం అధికంగా ఉందట. సాధారణంగా వరి సాగు చేయాలంటే నీరు ఎక్కువగా అవసరం. కానీ..   ఈ బియ్యంలో ఐరన్‌ శాతం పుష్కలంగా ఉండడమే కాదు.. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉందట. నీటి సౌకర్యం తక్కువగా ఉన్నా ఈ రకం సాగు చేసేందుకు అనువుగా ఉందట.

ఈ ‘డబ్ల్యూజిఎల్‌1119’ రకం వరి 115 రోజుల స్పల్పకాలిక రకంగా చెబుతున్నారు. అంటే 115 రోజుల్లోనే పంట చేతికి వస్తుందన్నమాట. అంతే కాదు.. ఈ ‘డబ్ల్యూజిఎల్‌1119’ రకం గింజ బీపీటీలా సన్నగా ఉంటుందట. ఇంకా ఉల్లికోడు తెగులును సైతం తట్టుకుంటుందట. ఇక దిగుబడి విషయానికి వస్తే..  ఎకరానికి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందట. ఈ ‘డబ్ల్యూజిఎల్‌1119’ రకం కిలో బియ్యంలో 21.03 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉన్నట్టు సైంటిస్టులు కనుగొన్నారు.

సాధారణ రకం బియ్యం కంటే ఈ ఐరన్ శాతం చాలా ఎక్కువ అని సైంటిస్టులు చెబుతున్నారు. త్వరలోనే ఈ నూతన వరి వంగడాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామని వరంగల్‌ ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ రావుల ఉమారెడ్డి చెబుతున్నారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలను అభివృద్ధి చేశారు. తాజా ‘డబ్ల్యూజిఎల్‌1119’ వంగడాన్ని బయో టెక్నాలజీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: