వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల వరద పారించడంతో ప్రతిపక్షాలకు విమర్శించడానికి పెద్ద అవకాశం లేకుండా పోయింది. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయి. దీంతో చిన్నా చితకా అసంతృప్తులేవీ వారికి ఆనడంలేదు. ప్రతిపక్షాలు అమరావతికోసం పోరాటం చేసినా అది ఫలించలేదు. మద్యం రేట్లు పెంచారని, ఇసుక అందుబాటులో లేదని, ఇంగ్లిష్ మీడియం పెట్టి తెలుగు లేకండా చేస్తున్నారని... ఇలా కొన్ని కారణాలను పట్టుకుని ఉద్యమాలు మొదలు పెట్టినా ఏవీ సక్సెస్ కాలేదు. కానీ ఇన్నాళ్లకు జాబ్ క్యాలెండర్ అనేది మాత్రం ఏపీలో సంచలనంగా మారింది.
అప్పటికీ వాలంటీర్లు, సచివాలయాల పోస్ట్ లతో వైసీపీ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసింది కానీ, జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలను మరీ తక్కువ చేసి చూపించడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరికి విద్యార్థి సంఘాలు జతకావడంతో నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. మరి వీటికి నాయకత్వం వహించేది ఎవరు?
ఓవైపు లోకేష్ నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడానికి తాను ముందుంటానంటూ వస్తున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ లతో హోరెత్తిస్తున్నారు. అవసరమైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామన్నారు. చలో తాడేపల్లి ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తామంటున్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేయబోతున్నారు. జనసేన తరపున నిరుద్యోగుల సమస్యలపై అధికారులకు రిప్రజెంటేషన్లు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వెంటనే తాజా జాబ్ క్యాలెండర్ రద్దు చేసి, ఎక్కువ పోస్ట్ లతో మరో క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే తాను కూడా కార్యాచరణలోకి దిగుతానంటూ హెచ్చరిస్తున్నారు.
సమస్య ఒకటే, కానీ పోరాటాలు వేరువేరు. ఒకటి టీడీపీ ఆధ్వర్యంలో, ఇంకోటి జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిరుద్యోగ పోరాటానికి నాయకత్వం వహించడానికి లోకేష్, పవన్ పోటీ పడుతున్నారు. ఇద్దరికీ ఆ క్రెడిట్ కావాలి. మరి చివరికి ఏమవుతుందో, ఎవరి పోరాటం ఫలిస్తుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి