జగన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావాలు ఎక్కువే ఉన్నాయి. అందుకే ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి మ్యానిఫెస్టోను తయారు చేశాడు. ప్రజలు కూడా వైఎస్ కుమారుడే కావడం వలన మాట తప్పదు మడమ తిప్పడని భావించి ఓట్లు కుమ్మేశారు. కట్ చేస్తే 2019 లో సీఎం కుర్చీ ఎక్కాడు. అయితే సీఎం అయ్యాక తన ప్రభావం అంతా ఇచ్చిన మానిఫెస్టోను ఖచ్చితముగా నెరవేర్చాలి అన్న ఉద్దేశ్యమే ఆయన పాలనలో కనిపించింది. అందుకే ఏమీ ఆలోచించలేదు ఉన్న డబ్బులన్నీ పోసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు. దాదాపుగా అన్నీ పూర్తయినట్టే . కొని హామీలు మాత్రం దశల వారీగా జరుగుతున్నాయి. అయితే అప్పుడు రాష్ట్రము యొక్క ఆర్ధిక పరిస్థితి ఏమిటి ? అసలు రాష్ట్రానికి అత్యవసరంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనకున్న ఆదాయ మార్గాలు ఏమిటి? అన్న విషయాలను అటు సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ, సలహాదారులు కానీ ఎవ్వరూ ఆలోచించినట్లు లేదు.

అలా ఆలోచించకపోవడం వల్లనే రెండు సంవత్సరాల తర్వాత దాని పర్యవసానాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. వివిధ బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పులు తీసుకుని, ఆ డబ్బు అంతటినీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రము ఆర్ధికంగా చాలా కష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. దీనికి బలవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి రావలసిన జీతాలు సమయానికి రావడం లేదు. దీని వలన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నాయి.

రాష్ట్రము నుంచి ఏదయినా ఆదాయం వస్తేనే బదిలీలు జరుగుతాయట, అవి కూడా వాయిదా పద్దతులలో చేయనున్నారని సమాచారం. ఇక అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి నత్త నడకన సాగిందో.. ఇప్పుడు అంతే. ఈ విషయంలో మాత్రం జగన్ సమన్యాయం పాటించారు. చంద్రబాబు సీనియర్ కాబట్టి ఆయననే ఫాలో అయ్యారు. ముందు ముందు రోజుల్లో అయినా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బాగుంటుందని లేదంటే పెవిలియన్ లో కూర్చోవలసిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్ మిగిలిన రెండేళ్లలో ఏమైనా అద్భుతాలు చేయగలడా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: