దేశంలో ధరల మోత మోగిపోతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేటు సెంచరీ దాటేసింది. పెట్రోల్ మోత అయితే సామాన్యులకు గుదిబండగా మారింది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ధరల మోతతో నడ్డి విరిగిన సామాన్యుడికి ఇప్పుడు మరోసారి నెత్తిన పిడుగుపడనుంది. సామాన్యులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే కేబుల్ నెట్ వర్క్ పైన ఇప్పుడు ధరల బాదుడు పడనుంది. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న అన్ని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్కలైన జీ, స్టార్, సోనీ, వయా కామ్ 18 సంస్థలు.... కొన్ని ఛానళ్లను తమ ప్యాక్ నుంచి తప్పించాయి. దీంతో ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి టీవీ ఛానళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన కొత్త టారిఫ్ ప్రకారం... బ్రాడ్ కాస్టర్లు అన్ని ధరలను భారీగా పెంచేస్తున్నారు. దేశంలో టెలికాం సేవలతో పాటు మొబైల్ సేవలను, బ్రాడ్ కాస్టింగ్ ధరలను పూర్తిగా నియంత్రించే అధికారం కేవలం ట్రాయ్‌కే ఉంటుంది.

కొత్తగా ధరలను పెంచేందుకు ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. గతంలో 2017 ఏడాది మార్చి నెలలో అన్ని టీవీ ఛానళ్లకు సంబంధించిన ధరలకు సంబంధించిన కొత్త టారీఫ్ ఆర్డర్‌ను ట్రాయ్ జారీ చేసింది. ఈ ఆర్డర్‌పై ఎన్నో సమస్యలు అప్పట్లో వచ్చాయి. దీంతో మరోసారి కొత్త టారీఫ్ జారీ చేయాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. 2020 ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి సవరించిన ఆర్డర్‌ను మళ్లీ జారీ చేసింది ట్రాయ్. దీనికి ఎన్‌టీఓ 2.0 అని పేరు పెట్టారు కూడా. ఈ టారీఫ్‌లో భాగంగా... ఈ ఎన్‌టీఓ 2.0లో భాగంగా ఒక్కొక్క ఛానల్ కనీస ధరను 12 రూపాయలుగా నిర్ణయించింది ట్రాయ్. అన్ని ప్రముఖ ఛానళ్లను తక్కువ ధరకే అందించాలనేది ట్రాయ్ ఆలోచన. గతంలో ఈ ధర ప్రతి నెల 15 రూపాయల నుంచి 25 రూపాయల మధ్య ఉండేది. కొత్త టారీఫ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమలుల్లోకి వస్తే... అన్ని టీవీ ఛానళ్ల ధరలు పెరగనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెల్లిస్తున్న దాని కంటే కూడా రెట్టింపు డబ్బు కట్టాల్సిందే. అంటే సామాన్యుల నెల వారీ బడ్జెట్ లెక్క అమాంతం పెరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: