కేంద్రంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 750మంది రైతులను బీజేపీ పొట్టనబెట్టుకుంది. పంజాబ్ సరిహద్దుల్లో చలిలో రైతులను హరిగోస పెట్టుకుంది. రైతు చట్టాలు తెచ్చి అన్నదాతలను హింస పెట్టి ఇప్పుడు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. తాను వెళ్లినప్పుడు ఒక విధంగా మాట్లాడిన కేంద్రమంత్రి, తమ ఎమ్మెల్యే, ఎంపీలు వెళితే.. ఎంత మందొస్తారు మీకు ఏం పనిలేదా.. అంటారా.. అని ప్రశ్నించారు. రైతుల తరఫున వెళ్లి మాట్లాడితే ఇదా మీ ప్రవర్తన అని మండిపడ్డారు.

మరోవైపు సాగు చట్టాలు గొప్పవైతే వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకుంటే ఎందుకు క్షమాపణలు చెప్పారో చెప్పాలన్నారు. 750మంది రైతులు చనిపోయిన తర్వాత యూపీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హడావుడిగా ప్రధాని సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేశారన్నారు. అటు రైతుల మెడపై కత్తి పెట్టినట్టుగా విద్యుత్ చట్టంతో ప్రతి బోర్ దగ్గర మీటర్ పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు.

కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం కోసం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యతన్నారు. కేంద్రం తీరు చిల్లరకొట్టు షావుకారులా ఉందన్నారు. లాభనష్టాలను బేరీజు వేస్తారా..? ధాన్యం కొనం.. కొనలేమంటూ బాధ్యత వదిలేసిందన్నారు. 90లక్షల టన్నుల ధాన్యం కొనాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. బాయిల్డ్ రైస్ గింజ కూడా కొనాలని చెప్పిందన్నారు. మరి రా రైస్ ఎంత కొంటారో కేంద్రం చెప్పడం లేదన్నారు సీఎం కేసీఆర్.  

కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తెలంగాణలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో పేగులు తెగేదాకా కొట్లాడినా ఆశించిన ఫలితం రాలేదన్నారు. వర్షాకాల పంటను మాత్రం ఎంతైనా కొంటామని చెప్పారు. మొత్తానికి ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ కేంద్రం తీరును ఎండగట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: