ఇప్పుడున్న రాజ‌కీయాల్లో పేరు పోగొట్టుకోవ‌డం.. తేలిక‌. కానీ, దానిని తిరిగి ద‌క్కించుకోవ‌డం మాత్రం చాలా క‌ష్టం. గ‌తం తాలూకు ప్రాభ‌వాన్ని తిరిగి పొందాలంటే..ఎంతో క‌ష్టించాలి. ఇలా ఇప్పుడు కొంత మేర‌కు కృషి చేసి.. మ‌ళ్లీ తిరిగి ప్రాభ‌వాన్ని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.. మాజీ మంత్రి. ఇప్పుడు ఆయ‌న గురించిన చ‌ర్చ టీడీపీలో జోరుగానే సాగుతోంది. ఒక‌ప్పుడు.. జోరుగా రాజ‌కీయాలు చేసిన‌.. ప్ర‌త్తిపాటి పుల్లారావు  కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ప్ర‌త్తిపాటి... వైసీపీ ప్ర‌భుత్వం రాగానే మౌనం దాల్చారు.

కార‌ణాలు ఏవైనా కూడా.. ప్ర‌త్తిపాటి.. మీడియాకు ముందుకు రావ‌డం మానేశారు. ఒక‌వైపు.. రాజ‌ధాని అమ‌రావ‌తికి టీడీపీ మ‌ద్ద‌తిస్తున్నా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు సైతం రోడ్డెక్కుతున్నా.. ప్ర‌త్తిపాటి మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ ప‌రిణామాలతో అస‌లు ఈయ‌న‌కు ఏమైంది ? అనే చ‌ర్చ జోరుగా సాగింది. పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌ర‌గడం.. ఆ వెంట‌నే చంద్ర‌బాబు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వ‌డం.. త‌ర్వ‌త రోజు.. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చోవ‌డం తెలిసిందే.

అయితే.. ఇన్ని జ‌రిగినా.. పుల్లారావు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ ప‌రిణామాల‌పై సీనియ‌ర్లు సైతం చ‌ర్చించుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చారు. ప్ర‌భుత్వం త‌ప్పులు చేస్తోంద‌ని అంటున్నారు. అంతేకాదు.. ప‌టిష్ట‌మైన పునాదులు ఉన్న టీడీపీని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరంటూ.. ప‌రోక్షంగా.. జిల్లా నాయకుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు త్వ‌ర‌లోనే.. తాను నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క కార్య‌క్ర‌మం చేయ‌బోతున్నాన‌ని.. చెప్పుకొచ్చారు.

పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌తిఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు. తాను పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తాన‌ని.. త్వ‌రలోనే.. నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌ల‌తో భేటీ అవుతాన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. ఇన్నాల్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఇప్ప‌టికైనా.. మాజీ మంత్రి పుంజుకోవ‌డం బాగానే ఉంద‌ని చెబుతున్నారు త‌మ్ముళ్లు. మ‌రి ఏమేర‌కు దూకుడుగా ముందుకు సాగుతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: