గులాబ్ తుఫాను పరిహారం చెల్లించడంలో జగన్ ముందున్నారు. ఆ మాటకు వస్తే ఇచ్చిన మాట ప్రకారమే ఆయన రైతును ఆదుకున్నారు. కానీ పంట నష్టం నమోదులో అధికారులే తప్పిదాలు చేశారన్న వాదన మాత్రం ఇప్పటికీ ఉంది. అలానే జవాద్ తుఫాను నేపథ్యంలోనూ ఉత్తరాంధ్రలో పంటలు పోయాయి. ముఖ్యంగా చేతికి పంట వచ్చే సమయానికి తుఫాను ప్రభావం ఉండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ విధంగా జగన్ రెండు తుఫానులనూ సమర్థంగా ఎదుర్కొన్నా కూడా  పంట నష్టం అంచనాల్లో చెల్లింపుల్లో మాత్రం ఎప్పటిలానే విమర్శలు అందుకున్నారు అన్నది ఓ వాస్తవం. ఇదే క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం.


తీవ్ర తుఫానులు అంచనా వేయడం వాటిని ఎదుర్కొనే విషయమై అప్రమత్తంగా ఉండడం అన్నవి ఎప్పుడూ చేయాల్సిన పనులు. నిధులు విధులు అన్నవి ఇలాంటి వేళనే ఎంతో అవసరం కూడా! అదృష్టవశాత్తూ నిన్నటి తుఫాను వేళ శ్రీకాకుళం జిల్లాలో ప్రాణ నష్టం పెద్దగా ఏమీ లేదు. అయితే పంట నష్టాలు మాత్రం ఉన్నాయి. వీటిని నివారించేందుకు తగ్గ చర్యలేవీ అధికారులు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనులు వేగం అయితే ఈ సారి కొంత మేర పంటనష్టం తగ్గేది. కానీ ఆ పనులేవీ ఇప్పటిదాకా మొదలుకాలేదనే తెలుస్తోంది. ఆస్తి నష్టం ఎంతన్నది ఇంకా తెలియరాలేదు. క్షేత్ర స్థాయిలో అధికారులు తిరుగాడి నిర్ణయిస్తేనే పక్కా వివరం అన్నది నిర్థారణ అవుతుంది.


గులాబ్ తుఫాను జీవితాలను కుదిపేసింది. ఇదంతా గత నెల కథ. తరువాత వచ్చిన జవాద్ తుఫాను మరింత ఆందోళనకు గురి చేసింది. ఈ రెండు తుఫానులు ఈ ఏడాదిలో రెండు నెలల వ్యవధిలోనే జరగడం శోచనీయం. దీంతో పంట నష్టాలపై అదేవిధంగా వివిధ పరిణామాలపై ఇప్పటికే రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికే గులాబ్ తుఫానుకు సంబంధించి పరిహారం అందించిన ఏపీ సర్కారు, ఇక జవాద్ తుఫాను విషయమై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలిక. పంటనష్టాలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది. అధికార వర్గాలు సైతం కొద్ది రోజులు గడువు కోరుతున్నాయి. మంత్రి సీదిరి సైతం క్షేత్ర స్థాయిలో  పనిచేశారు. తుఫాను పీడిత ప్రాంతాలలో తిరుగాడి ఎక్కడిక్కడ నష్ట నివారణ చర్యలను పర్యవేక్షించారు. పలాస మండలం బ్రహ్మణతర్ల, అమలకుడియా ప్రాంతాల్లో  పర్యటించి పంట నష్టం పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని అధికారుల సూచనలు పాటిస్తూ తుఫాను తీవ్రత తగ్గే వరకూ ఇళ్లకే పరిమితం కావాలని తీర ప్రాంత వాసులను మంత్రి కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp