ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు... జనాల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే సీఎం జగన్ ఎమ్మెల్యేలను జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. ఆమేరకు వారంతా గడప గడపకు వెళ్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది వివరిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. కొన్నిచోట్ల మాత్రం నాయకులకు నిరసన సెగ తప్పడంలేదు. నాయకులను ప్రజలు నిలదీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఏది నిజం..? ఎంత నిజం..?
అధికారంలో ఉన్న పార్టీపై, అధికారంలో ఉన్న నాయకులపై సహజంగానే కాస్త వ్యతిరేకత ఉంటుంది. ఈ క్రమంలో అక్కడక్కడ ప్రజలు తమ నిరసన తెలిపే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ నిరసన ఏ స్థాయిలో ఉందనేదే అసలు సమస్య. తాజాగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ను పలువురు మహిళలు నిలదీశారనే వార్తలొచ్చాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేట పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆయన్ను నిలదీశారని అంటున్నారు. అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని గణేష్ అంటున్నారు.

ఇటీవల నెల్లూరు జిల్లా సిటీ నియోజకవర్గ పరిధిలో కూడా ఇలాంటి వీడియోలు చక్కర్లు కొట్టాయి. మాజీ మంత్రి అనిల్ కి సంబంధించి కొన్ని పాత వీడియోలను కొంతమంది సర్క్యులేట్ చేశారు. అయితే తనపై దుష్ప్రచారం చేసేందుకే కొంతమంది ఇలా చేస్తున్నారని మండిపడ్డారు అనిల్. పాత వీడియోలు తీసుకొచ్చి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన యూట్యూబ్ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని అంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రజలు తమకు కలికిన మేలుని గుర్తు పెట్టుకున్నారని, వారంతా మరోసారి తమను ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. తమ కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి టీడీపీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయిస్తోందని అంటున్నారు. మొత్తమ్మీద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: