రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీలోని సీనియర్లలో చాలామందికి పెద్ద షాక్ తప్పేట్లులేదు. పార్టీవర్గాల అంచనా ప్రకారం సుమారు 30 మంది సీనియర్లకు వచ్చేఎన్నికల్లో పోటీచేయటానికి అవకాశంలేదట. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిదేమో పొత్తులో జనసేనకు 24 సీట్లు కేటాయించటం. ఇక రెండోది కొందరి ట్రాక్ రికార్డు సరిగాలేని కారణంగా గెలుపు అవకాశాలు లేవని తేలటం. మూడో కారణం ఏమిటంటే బీజేపీ కూడా పొత్తులో కలిస్తే మరింతమంది సీనియర్లు పోటీకి దూరంకాక తప్పదు.





ఇలాంటి వాళ్ళల్లో ఇపుడు నలుగురు సీనియర్లగురించి పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వారెవరంటే గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నలుగురిలో ముగ్గురు కమ్మ సామాజికివర్గానికి చెందిన నేతలే. ఈ ముగ్గురిలో చింతమనేని, దేవినేని అంటే పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో చంద్రబాబు, లోకేష్ ను చూసుకుని పై నలుగురు రెచ్చిపోయారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో భూముల ఆక్రమణల్లో గంటా పేరు బాగా నానింది. గంటా భూఆక్రమణలు ఏస్ధాయిలో జరిగిందంటే సహచర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు.





ఇక యరపతి వ్యవహారమంతా మైనింగ్. గుంటూరు జిల్లాలోని గురజాల కేంద్రంగా యరపతినేని యధేచ్చగా మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు పార్టీలో వాళ్ళే ఆరోపించారు. అంతేకాకుండా విచారణలో హైకోర్టు కూడా అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారించింది. సీబీఐ విచారణకు ప్రభుత్వాన్ని కోరమని హైకోర్టు చెప్పిందికానీ  తర్వాత ఏమైందో తెలీలేదు.





ఇక దేవినేని ఉమ గురించి ఎంతతక్కువ చెప్పుకున్నా ఎక్కువే. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నపుడు యధేచ్చగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మంత్రిగా పనిచేసిన ఐదేళ్ళల్లో పార్టీలోని సీనియర్లు, నియోజకవర్గంలోని నేతల్లో చాలామంది దూరమైపోయారు. చాలామందితో శతృత్వం పెరిపోయి ఇపుడు అందరు దేవినేనికి వ్యతిరేకమైపోయారు. చింతమనేని వ్యవహారం కూడా ఇంతే. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెచ్చిపోవటంతో పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. రకరకాల కారణాలతో పైనలుగురికి టికెట్లు దాదాపు లేదనే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: