
తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ప్రభుత్వ వాదనలు వినకుండా హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుగా పేర్కొంది. కేసులో పూర్తి వివరాలు సీల్డ్ కవర్‌లో సమర్పించాలన్న సూచన మేరకు అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు పక్షాల వాదనలు తిరిగి విని, కేసు మెరిట్స్ ఆధారంగా కొత్తగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామాల వల్ల, వంశీకి తీవ్ర నష్టమే. గతంలో జారీ చేసిన పీటీ వారెంట్‌లు అమలయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు కారణంగా అప్పట్లో పోలీసులు వంశీని అరెస్టు చేయలేదు. కానీ ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోవడంతో అరెస్టు అవకాశం బలంగా ఉంది. అయితే హైకోర్టు తాజా విచారణ పూర్తయ్యేంత వరకూ పోలీసులు సంయమనంతో వ్యవహరించే అవకాశముంది.
ఇదే క్రమంలో, రాజకీయంగా కూడా ఈ పరిణామం కీలకంగా మారుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ, జగన్ ను కలవడం.. వైసీపీ తరపున రాజకీయాలు చేస్తాడని.. పేర్ని నాని వంటి వాళ్లు ప్రకటిస్తూండటంతో ఏమైనా జరగవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. అయితే ఈ కేసులో తుది తీర్పు వచ్చేంతవరకూ వంశీ రాజకీయంగా ఏదైనా పెద్దగా చేయగలరా అన్నదే ప్రశ్న. తుది మాటగా చెప్పాలంటే, సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వంశీకి ఒక న్యాయ, రాజకీయ సంక్షోభం మొదలైంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఇకపై కోర్టుల తీర్పులతో పాటు పోలీసుల తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.