
అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది – దానం నాగేందర్ మాత్రమే కాంగ్రెస్‌లో అధికారికంగా చేరారు. ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు కాబట్టి రికార్డుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకే చెందినట్టే ఉంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే వారు కేవలం “ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశాం” అని చెబితే, స్పీకర్ దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా అయితే న్యాయస్థానాలు కూడా పెద్దగా జోక్యం చేసుకోలేవు. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇది కాంగ్రెస్‌లో కూడా గట్టిపరిశీలనకు దారితీస్తోంది. ఎందుకంటే ఒకరికి డిస్క్వాలిఫికేషన్ చేసి మిగతావారిని వదిలేస్తే అది రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇక మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ల గురించి కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళే అవకాశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ క్షీణ స్థితిలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. పైగా ప్రజల్లో గతంలో ఉన్నంత కాంగ్రెస్ వ్యతిరేకత ఇప్పుడు కనిపించడం లేదు. దాంతో అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ను వాడుకుని ఉపఎన్నికల్లో భారీగా గెలిచే ఛాన్స్ ఉందని రేవంత్ అనుకుంటున్నారట. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తుది నిర్ణయం మాత్రం హైకమాండ్ సూచనలపై ఆధారపడుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద సస్పెన్స్‌గా మారింది.