ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి పండుగ సందడి మొదలైంది. గణేష్ విగ్రహాల ఏర్పాటు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భక్తులకు ఓ భారీ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక మంత్రి నారా లోకేష్ పాత్ర పెద్దది. వినాయక మండపాల నిర్వాహకులు పలువురు లోకేష్‌ను కలసి, “పందిళ్లకు విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి. ఉచిత సౌకర్యం కల్పిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది” అని వినతి పెట్టారు. వెంటనే లోకేష్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం చంద్రబాబు… “కోట్లాదిమంది భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరగాలి. విద్యుత్ బిల్లు వంటి సమస్యలు నిర్వాహకులకు భారం కాకూడదు” అని స్పష్టం చేశారు. వెంటనే ప్రత్యేకంగా జీఓ విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి దాదాపు 15 వేల గణేష్ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. ప్రతి మండపానికి అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తే, మొత్తం ఖర్చు సుమారు రూ.25 కోట్లు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇంతటితో ఆగకుండా, విజయదశమి వేళ ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీంతో హిందూ పండుగల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అడ్డంకులు లేకుండా జరిగేలా చర్యలు చేపట్టింది.

ఈ నిర్ణయం ఆధ్యాత్మిక వర్గాల్లో, భక్తులలో విపరీతమైన ఆనందం కలిగించింది. “ఇంతవరకు పండుగల సమయంలో విద్యుత్ బిల్లులు మాకు తలనొప్పి. ఇప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడం చాలా మంచి విషయం. భక్తులపై భారాన్ని తగ్గించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, “గణేష్ ఉత్సవాలంటే అదీ ఉచిత విద్యుత్ సౌకర్యంతోనే జరగాలి” అన్న అభిమతంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నిర్ణయం భక్తుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా మైలురాయిగా నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: