ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ అంటే ఎప్పుడూ చర్చల కేంద్రం. కానీ గత 16 నెలలుగా వైసీపీ సభకు దూరంగా ఉంటూ వస్తోంది. సాధారణంగా ప్రజలు తమ ఎమ్మెల్యే సభలో ఉంటూ, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ఆశిస్తారు. కానీ వైసీపీ హాజరుకాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ముగిసిన వర్షాకాల సమావేశాలు మాత్రం వైసీపీకి మాస్టర్ స్ట్రోక్‌లా మారాయని ఆ పార్టీ సర్కిల్‌లో విశ్లేషణ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెడితే కూటమి సభ్యులంతా ఒక్కసారిగా వారిపై దాడి చేస్తారని స్పష్టమే. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కలసి, గత అయిదేళ్ల వైసీపీ పాలన తప్పులనే ఎండగడతారు. ప్రతి ఇష్యూ లోనూ వైసీపీ పేరు లాగి జవాబు చెప్పమని కౌంటర్ వేస్తారు. ఆ వాతావరణంలో వైసీపీకి ఇబ్బందులు తప్పవని పార్టీ అర్థం చేసుకుంది. అందుకే ముందే వ్యూహాత్మకంగా దూరంగా ఉండటం బెట్టర్ అని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

వైసీపీ లేకుండా పోవడంతో అసెంబ్లీ సీన్ మాత్రం వేరేగా మారింది. సాధారణంగా విపక్షం ఉంటే అధికార కూటమి ఏకమై కనిపిస్తుంది. కానీ ఇప్పుడు విపక్షం లేకపోవడంతో లోపలున్న విభేదాలు బయటపడిపోయాయి. పాతవి కొత్తవి కలిపి అసంతృప్తులు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా బాలయ్య – కామినేని మధ్య ఎపిసోడ్ అయితే మొత్తం సెషన్ హైలెట్‌గా నిలిచింది. ప్రజా సమస్యల పేరుతో కొందరు తమ అజెండాలను మాత్రమే నెట్టారు. దాంతో సభలో కూటమి అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా హైలెట్ అయ్యాయి. వైసీపీ లేకుండా ఎనిమిది రోజులపాటు జరిగిన వర్షాకాల సమావేశాలు కూటమి ఆశించినంత మైలేజ్ ఇవ్వలేకపోయాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, నిందలు వేసుకోవడంతో కూటమి పల్చబడినట్లు ఇమేజ్ వచ్చింది. అసలు ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన చోట, నేతల తీరుతో మొత్తం ఫోకస్ డైల్యూట్ అయ్యింది. ఇది వైసీపీకి ఊహించని లాభంగా మారిందని చెబుతున్నారు.

ఇక అసలు ప్రశ్న – వైసీపీ ఉండాల్సిందేనా? కూటమి ఎమ్మెల్యేలు ఏకమై తమ ఫోకస్‌ను విపక్షం మీద పెట్టాలంటే వైసీపీ సభలో ఉండాల్సిందే అన్నది వర్షాకాల సమావేశాలు తేటతెల్లం చేశాయి. కానీ వైసీపీ మాత్రం "ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాం" అని తన స్టాండ్ క్లియర్‌గా చెప్పేస్తోంది. ఇక చలి కాలం సమావేశాల నాటికి వైసీపీ వ్యూహం ఏమిటి? అదే పాత స్టాండ్ కొనసాగిస్తుందా లేక అసెంబ్లీలోకి అడుగుపెడుతుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండటమే కాకుండా, ఆ వ్యూహం వల్ల కూటమి లోపలున్న అసమ్మతులు బహిర్గతం కావడం గమనార్హం. కూటమి తాము హైలెట్ కావాలని ప్రయత్నించినా, చివరికి వైసీపీకి లాభం కలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చలి కాలం సమావేశాల్లో ఎవరి వ్యూహం గెలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: