 
                                
                                
                                
                            
                        
                        తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ఆ పార్టీకి, తాను ఎమ్మెల్సీగా దక్కిన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎమ్మెల్సీ రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటివరకు ఆమోదించకపోవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కవిత ఇంకా మాజీ ఎమ్మెల్సీగా మారలేదు.
బీఆర్‌ఎస్‌తో బంధాన్ని తెంచుకున్న కవిత, సొంతంగా రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తాను ప్రస్తుతం నడుపుతున్న తెలంగాణ జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా మారుస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రజలు కోరుకుంటేనే పార్టీ పెడతానని కవిత స్పష్టం చేశారు. ఇక్కడ 'ప్రజలు' అంటే జాగృతి నాయకులు, తన శ్రేయోభిలాషులు అని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు.
సొంత రాజకీయ మార్గాన్ని వెతుక్కునే క్రమంలో కవిత ప్రస్తుతం 'జాగృతి జనం బాట' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రను ప్రారంభించి బిజీగా ఉన్నారు. ఈ యాత్రలో ఆమె తన తండ్రి కేసీఆర్ నీడ నుంచి బయటకు వచ్చి, 'కవిత' అనే సొంత గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 20 ఏళ్లు కేసీఆర్ కోసం పని చేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి బయటకు పంపించారని ఆమె ఆరోపించారు. తాను కేసీఆర్ కూతురిగా కాకుండా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రస్తుతానికి అయితే జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం ఇప్పట్లో లేదని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదని, ప్రజలకు మంచి చేయడమే ముఖ్యమని ఆమె అన్నారు. అయితే, రాబోయే కాలంలో ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి, ముఖ్యంగా 'జనం బాట' యాత్రకు లభించే ఆదరణను బట్టి ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి