ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వకూడదనే చర్చ మొదలైన వేళ, జగన్ మాత్రం తన జీతాన్ని తీసుకోవడం మానేశారు. ఈ నిర్ణయం వెనక ఆయనకు ఉన్న రాజకీయ లెక్కలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో వెల్లడించిన వివరాల ప్రకారం, వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలలో జగన్ మినహా మిగతా పది మంది తమ జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని తెలిపారు. జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరు కావడం లేదని, జీతం కూడా తీసుకోవడం లేదని స్పీకర్ స్పష్టంచేశారు.


 దీనివల్ల జగన్ తనపై అనర్హత వేటు పడే అవకాశాన్ని ముందుగానే అడ్డుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సాధారణంగా, ఎమ్మెల్యేలు వరుసగా అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే స్పీకర్‌కు వారిపై అనర్హత వేటు వేసే అధికారం ఉంటుంది. అయితే, జగన్ తన జీతం తీసుకోకుండా ఉండటంతో, “నేను అసెంబ్లీ సభ్యునిగా ఆర్థిక లాభం పొందడం లేదు” అన్న న్యాయస్థానం ముందు వాదనకు అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా న్యాయపరమైన రక్షణ కవచంగా పరిగణిస్తున్నారు. ఇక మిగతా పది మంది వైసీపీ ఎమ్మెల్యేల విషయం వేరేలా ఉంది. వారు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదు, కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. నెలకు సుమారు ఐదు లక్షల రూపాయల వరకు జీతం, అలవెన్సులు లభిస్తాయి.

 

అయితే అసెంబ్లీకి హాజరు కాకుండా ఆ డబ్బులు తీసుకోవడం ప్రజాప్రతినిధుల నైతికతకూ, చట్టబద్ధతకూ విరుద్ధమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, ఈ విషయం పై అసెంబ్లీ లోనే చర్చ జరగనుందని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న చర్చనీయాంశమవుతోంది - జగన్ ముందుగానే ఈ లీగల్ మువ్ చేసి తనపై అనర్హతా వేటు తప్పించుకోవాలనుకున్నారా ? జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని అందరికీ తెలుసు. ఈసారి కూడా తనకు వ్యతిరేకంగా ఏదైనా చట్టపరమైన దాడి జరిగితే దానిని ఎదుర్కొనేలా ముందస్తు సన్నాహాలు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా, జీతం తీసుకోని జగన్ నిర్ణయం ఇప్పుడు అసెంబ్లీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇక స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తారు? మిగతా పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: