తిరుపతి జిల్లాలో అటవీ శాఖ పరిధిలోని ఎర్రచందనం డిపోను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. మొత్తం ఎనిమిది గోడౌన్లు ఉన్న ఆ డిపోలో ప్రతి దుంగను స్వయంగా పరిశీలించిన పవన్ చూపించిన శ్రద్ధ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎర్రచందనం చెట్లు నరికిపోవడం పట్ల పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది జాతి సంపద, దాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. ఎన్ని లక్షల చెట్లు నరికి వేయబడ్డాయో ప్రపంచం మొత్తానికి తెలియాలి” అని ఆయన స్పష్టం చేశారు. అటవీ శాఖలో పెద్ద ఎత్తున వృక్ష సంపద విధ్వంసం జరిగినట్లు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్మగ్లర్లు దేశ ఆస్తిని దోచుకుంటూ పచ్చని అడవులను బీభత్సంగా మార్చారని ఆయన అన్నారు. “ఇక నుంచి ఈ దోపిడీ తతంగం ఆగాలి. ఎవరైనా లంకె లాగినా ఉపేక్షించం” అని గట్టిగా హెచ్చరించారు. పవన్ కొత్త సాంకేతికతతో ఎర్రచందనానికి రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఎర్రచందనం దుంగకు జియో ట్యాగింగ్ చేయాలని, లైవ్ ట్రాకింగ్ ద్వారా ప్రతి దుంగను పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా బయటకు పోకూడదు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్మకం జరిగే వరకు ట్రాకింగ్ తప్పనిసరి” అని పవన్ గట్టిగా చెప్పారు. పాత లాట్ నంబర్ల వ్యవస్థను రద్దు చేసి, ఆధునాతన సాంకేతికతతో భద్రత కల్పించాలని నిర్ణయించారు.



ఇదిలా ఉంటే, పవన్ దృష్టిని ఒక విదేశీ మొక్క ఆకర్షించింది. టెరోమా జేరా అనే ఆ మొక్క గురించి అధికారులు వివరించగా, పవన్ ఆసక్తిగా విన్నారు. ఆకులు రాలిన తర్వాత పూలతో కనువిందు చేసే ఈ మొక్క పట్ల ఆయన ప్రత్యేక ఆసక్తి చూపించారు. అంతేకాకుండా ఎర్రచందనానికి గ్రేడ్లు ఎలా ఇస్తారో స్వయంగా తెలుసుకున్నారు. సుత్తితో దుంగ మీద కొట్టి వచ్చే శబ్దం ఆధారంగా గ్రేడ్ నిర్ణయిస్తారని అధికారులు చెబుతుండగా, పవన్ సైతం స్వయంగా పరీక్షించారు. ఎర్రచందనం దుంగలతో తయారు చేసిన విగ్రహాలు, బ్రీడ్స్, చిన్న వస్తువులు, ఔషధ తయారీలో ఉపయోగించే పొడి అన్నింటినీ పరిశీలించారు. పవన్ ఈ పర్యటనతో అటవీ శాఖలో కొత్త ఉత్సాహం నింపారు. “ప్రతి చెట్టు జాతి ఆస్తి… దాన్ని కాపాడటం మన ధర్మం” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: