తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో ఆయన చూపిస్తున్న ఆత్మవిశ్వాసం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. “మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది” అని స్పష్టంగా ప్రకటించిన రేవంత్, తన పదవీ కాలం పది సంవత్సరాలకు పొడిగించుకునే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నమ్మకం వెనుక ఉన్న విశ్లేషణ, రాజకీయ లెక్కలు ఆయన ఆలోచనాత్మక నాయకుడిగా మారుతున్నారనే సంకేతాలనిస్తుంది. రేవంత్ రెడ్డి నమ్మకం సాధారణ విశ్వాసం కాదు. ఆయన చెప్పే లాజిక్‌కి చరిత్ర సాక్షం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు, ప్రజలు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చిన చరిత్ర ఉంది. 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్‌, అనంతరం బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో కొనసాగాయి.
 

ఇక ఇప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన ఈ చాన్స్‌ కూడా అదే సైకిల్‌లో భాగమేనని రేవంత్ విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన చెబుతున్న “మరోసారి కాంగ్రెస్ే” అన్న మాటలో ఆత్మవిశ్వాసం కంటే ఎక్కువగా రాజకీయ అవగాహన దాగి ఉంది. అయితే ఈ సెంటిమెంట్ ఒక్కటే ప్రజాస్వామ్యంలో గెలుపునకు సరిపోదు. గతంలో రెండోసారి గెలిచిన పార్టీలకు ప్రజలు ఇచ్చిన పాజిటివ్ వేవ్‌, సమాజంలో ఉన్న ప్రత్యేక రాజకీయ సమీకరణాలు కూడా బలంగా దోహదపడ్డాయి. చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి రావడానికి అభివృద్ధి ఆధారమైన వేవ్‌ కారణమైంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలో ప్రతిపక్ష ఓట్ల చీలిక సహకరించింది. బీఆర్ఎస్‌కి తెలంగాణ సెంటిమెంట్‌ గాలి తోడైంది. కాబట్టి రేవంత్ కూడా రెండోసారి గెలవాలంటే ఓ బలమైన ఎమోషనల్ ఫ్యాక్టర్‌ అవసరం. ప్రస్తుతానికి రేవంత్ పాలనపై పూర్తి దృష్టి పెట్టారు.

 

ప్రజలతో అనుసంధానం పెంచే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, పరిపాలనలో పారదర్శకతను ప్రాధాన్యంగా చూస్తున్నారు. రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయాలపై దృష్టి కేంద్రీకరించారు. కానీ ఆయనకు అవసరమైనప్పుడు రాజకీయ మైలేజీ ఎలా పొందాలో బాగా తెలుసు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆ వ్యూహాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న లాజిక్, రాజకీయ లెక్కలు, అనుభవం ఆయనను మరింత శక్తివంతమైన నాయకుడిగా నిలబెడుతున్నాయి. తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి కానీ, రేవంత్ చూపుతున్న ఆత్మవిశ్వాసం మాత్రం ఆయనకు భవిష్యత్తులో పెద్ద బలం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: