ముఖ్యంగా అద్దంకి వంటి ప్రాంతాలను ఒంగోలు జిల్లాకు దగ్గరగా ఉన్నప్పటికీ బాపట్ల జిల్లాలో చేర్చడం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉపసంఘం నివేదికలో పేర్కొంది. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త జిల్లాల రూపకల్పన చేపట్టామని మంత్రి వర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. పునర్విభజనలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పడమర గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి జిల్లా పరిపాలన సౌకర్యంగా ఉండేలా ఐదు నుండి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండేలా పునర్విభజన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఇక కొత్త జిల్లాల జాబితాలో అమరావతి, మదనపల్లి, ఆదోని, గూడూరు, నరసాపురం, మార్కాపురం వంటి పేర్లు ఉన్నాయి. ఈ జిల్లాల రూపకల్పనతో రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు దగ్గరగా ఉండే పరిపాలన వ్యవస్థను అందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం, అభివృద్ధి దృష్ట్యా కొత్త జిల్లాలను ప్రకటించాలనే కసరత్తు ఈ సారి మరింత శాస్త్రీయంగా సాగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోయినా, కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే కొత్త జిల్లాల గజెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. మొత్తానికి, కొత్త జిల్లాల రూపకల్పనతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థకు కొత్త ఊపిరి అందనుంది. పాత తప్పులను సరిదిద్దుతూ ప్రజలకు చేరువయ్యే పరిపాలనను అందించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు స్పష్టమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి