రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - దేశ రాజకీయాల్లో ఎప్పటికీ హాట్ టాపిక్. హిందూ వాద సంస్థ అని పేరొందిన ఆర్ఎస్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. “ఆర్ఎస్ఎస్ కి మతం లేదు, కులం లేదు, దేశ హితం మాత్రమే మతం” అని పెద్దలు చెబుతున్నా, విమర్శకులు మాత్రం దానిని రాజకీయంగా చూసే అలవాటు మానలేదు. అయితే గత పదిహేనేళ్లుగా ఆ సంస్థను నడిపిస్తున్న సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మాత్రం ప్రతి విమర్శకుడికీ తగిన సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్దీ ఉత్సవాల సందర్భంగా మోహన్ భగవత్‌ను ఒక ప్రశ్న ఎదురైంది - “ఆర్ఎస్ఎస్‌లో ముస్లింలు చేరవచ్చా?” అని. ఈ ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానమిస్తూ, “ఎవరైనా భారత మాత బిడ్డ అయితే ఆర్ఎస్ఎస్‌లో చేరొచ్చు.
 

హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవుడు అనే తేడా లేదు. దేశం పట్ల ప్రేమ, సేవా భావం ఉంటే చాలు” అని చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మోహన్ భగవత్ చెప్పిన మరో కీలక విషయం - “ఆర్ఎస్ఎస్ కి రాజకీయాలు లేవు, మాకు ఉన్నది కేవలం దేశ సేవా తపన మాత్రమే” అని. అధికారంలోకి రావాలన్న కోరిక కానీ, రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలన్న దురుద్దేశం కానీ ఆ సంస్థలో లేదని ఆయన స్పష్టంచేశారు. “మా లెక్కల్లో ఎవరు బ్రాహ్మణులు, ఎవరు ఇతర కులాలవారు అనే గణాంకం ఉండదు. ఆర్ఎస్ఎస్‌లో అలాంటి వివక్ష ఎప్పుడూ ఉండదు” అని ఆయన ధైర్యంగా అన్నారు. తమ సంస్థలో కులం, మతం, ప్రాంతం అన్నది ఉండదని, ఒక్కటే నినాదం — “భారత మాత కోసం పని చేయడం” అని మోహన్ భగవత్ వివరించారు. ఆర్ఎస్ఎస్ అనేది దేశానికి నిస్వార్థంగా సేవ చేయాలనుకునే వారికి ఒక వారధి అని చెప్పారు.

 

ఇక ఆర్ఎస్ఎస్‌కు రిజిస్ట్రేషన్ లేదని, బ్రిటిష్ కాలంలో పుట్టిందని విపక్షాలు చేసే ఆరోపణలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. “బ్రిటిష్ పాలనలో పుట్టినప్పుడు వాళ్ల వద్దే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా?” అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రజలు మొదట ఆర్ఎస్ఎస్‌ను నమ్మలేదని కానీ కాలక్రమంలో దాని ఉద్దేశం అర్థం చేసుకున్నారని, అందుకే నేడు ఆ సంస్థ వందేళ్ల దిశగా పయనిస్తోందని ఆయన చెప్పారు. “మూడుసార్లు నిషేధం ఎదురైనా, న్యాయం మా వైపే ఉంది కాబట్టి మేము నిలబడ్డాం. ప్రజల సేవే మా పథం” అని భగవత్ స్పష్టం చేశారు. మొత్తానికి, మోహన్ భగవత్ మాటల్లో ఆర్ఎస్ఎస్ అంటే కేవలం హిందూ సంస్థ కాదు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామాజిక శక్తి. ఆయన తాజా వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్‌ను మరోసారి దేశ చర్చా కేంద్రంగా మార్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: