ఘటన స్థలాన్ని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్స్, ఎస్పీజీ , ఎన్‌ఎస్‌జీ మరియు ఏటీఎస్ బృందాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక పరిశీలనలో పేలుడు ప్రదేశంలో ఎటువంటి గుంతలు లేదా పెద్ద మౌలిక నష్టం ఏర్పడలేదని, అయితే కారు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. మొదటిది ఇది ఆర్డీఎక్స్ పేలుడు అని భావించినా, ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. దర్యాప్తు బృందాలు పేలుడు జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించగా, కీలకమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. పేలుడు సంభవించే క్షణాల ముందు, సుమారు సాయంత్రం 6:52 గంటలకు, ఆ హ్యుందాయ్ ఐ20 కారును ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తూ కనిపించినట్లు అధికారులు తెలిపారు.
ఆ వ్యక్తి గుర్తింపుపై ప్రస్తుతం పోలీసులకు దాదాపు స్పష్టత వచ్చింది. అతడు మహ్మద్ ఉమర్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. వృత్తి పరంగా వైద్యుడైన ఈ వ్యక్తి, అసలు జమ్మూ కశ్మీర్‌కు చెందినవాడు అని, అతనికి *ఫరీదాబాద్ మాడ్యూల్ *తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గూఢచార సంస్థలు నిర్ధారిస్తున్నాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, మహ్మద్ ఉమర్ గత కొద్ది నెలలుగా ఢిల్లీలోని పరిసర ప్రాంతాల్లో తరచుగా కనిపించాడని, వివిధ హాస్పిటళ్లలో తాత్కాలికంగా పనిచేశాడని తెలుస్తోంది. అయితే అతను ఇటీవల అకస్మాత్తుగా అదృశ్యమవడంతో భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఈ పేలుడు ఘటనకు పుల్వామా అటాక్ నేపథ్యం కలిగి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఎందుకంటే, పుల్వామాకు చెందిన తారిఖ్ మరియు మహ్మద్ ఉమర్ ఇద్దరూ గతంలో జైష్-ఎ-మొహమ్మద్ మాడ్యూల్‌తో పనిచేసినట్లు పాత ఇంటెలిజెన్స్ రికార్డులు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పుల్వామా అటాక్ సూత్రధారుల మిగిలిన నెట్వర్క్ పునరుద్ధరణ కృషిలో భాగమా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దర్యాప్తు బృందాలు ప్రస్తుతం ఆ కారు కొనుగోలు రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, సిమ్ కార్డు డేటా, మరియు సోషల్ మీడియా యాక్టివిటీలను విశ్లేషిస్తున్నాయి. అలాగే పేలుడు పదార్థాల మూలం ఎక్కడి నుంచో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందాలు కష్టపడుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఈ కేసును టెర్రరిజం యాంగిల్‌లో పరిశీలిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై ప్రత్యేక రిపోర్ట్ కోరింది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి