తెలంగాణలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ కోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టగా, ఈ 10 మందిలో దానం నాగేందర్ కేసు అత్యంత బలమైన సాక్ష్యాలతో ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పార్లమెంట్ పోటీ చేయడం స్పీకర్ ముందున్న కేసుకు కీలక ఆధారమైందని అంటున్నారు. దీంతో ఆయన అనర్హత ఖాయం అన్న భావన పెరుగుతోంది. అనర్హత వేటు పడకముందే దానం నాగేందర్ స్వయంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం హాట్‌గా వినిపిస్తోంది.
నిజానికి దానం చాలా రోజుల క్రితమే రాజీనామా చేయడానికి ముందుకొచ్చారని, కానీ సరైన సమయం కోసం సీఎం రేవంత్ రెడ్డి వేచి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కనుక మంచిగా మారిన నేపథ్యంలో, రేవంత్ స్వయంగా దానం రాజీనామా కార్డ్‌ను బయటకు తీయవచ్చని టాక్. ఇదిలా ఉండగా... జూబ్లీహిల్స్‌లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్, ఖైరతాబాద్‌లో కూడా ఉప ఎన్నిక చేయడానికి సిద్ధమా? అన్న ప్రశ్న పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు “ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగాలి… మేము గెలుస్తాం” అని బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా చెప్పేవారు. కానీ జూబ్లీహిల్స్ ఓటమి ఆ ధైర్యాన్ని బాగా దెబ్బతీసింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు త్వరితగతిన అనర్హత తీర్పులు రావాలని కోరుకుంటుందనే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీఆర్ఎస్‌ను మరింత రక్షణాత్మక స్థితిలోకి నెట్టే ప్రయత్నంగా దానం రాజీనామాను ఉపయోగించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కొద్ది రోజుల్లోనే ఖైరతాబాద్ రాజకీయాలు వేడెక్కి ఉప ఎన్నికల దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి